రాయలసీమ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుందని అంటున్నారు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి. ఈ విషయంలో చేపట్టాల్సిన కర్తవ్య కార్యాచరణపై సెప్టెంబర్ 15న నంద్యాలలో జరిగే సదస్సు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుందని అంటున్నారాయన..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతాల పట్ల వివక్షకు వ్యతిరేకంగా బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమం జరిగిన విషయం అందరికి విదితమే. ఈ ఉద్యమ ఫలితంగా అక్టోబర్ 1,1953 న తెలుగు రాష్ట్రం ఆవిర్భవించింది. కర్నూలో నవంబర్ 1, 1956న తెలంగాణా ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే తెలంగాణ ప్రాంతం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడంతో 1953లో ఏర్పడిన తెలుగు రాష్ట్రమే నేడు కొనసాగుతున్నది.
తెలుగు ప్రాంతంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఏర్పడబోయే తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక కార్యాచరణ కోసం 1937లోనే ఒప్పందాలు జరిగాయి. తదనంతరం జరిగిన అనేక పరిణామాల సందర్భంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ, ఈ ప్రాంతం అభివృద్ధికి సానుకూలంగా తీర్మానాలు చేస్తున్నాయి.
అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ అనేక ప్రతిపాదనలు చేస్తున్నప్పటికి, రాయలసీమకు ఉన్న నీటి వాటాను కూడా ఉపయోగించుకొనలేని పరిస్థితికి నెట్టి వేయబడింది. ఇక విద్యా, వాణిజ్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనలో కూడా తీవ్ర వివక్షకు గురవుతునే ఉంది.
అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ అభివృద్ధికి తీర్మానాలు చేస్తున్నాయి, కాని వాటి అమలుకు కార్యాచరణ చేపట్టడంలో విఫలం అవుతున్నాయి. ఈ రాజకీయ పద్మవ్యూహం నుంచి రాయలసీమను విజయవంతంగా బయటకు తీసుకొని రావలసిన బాధ్యత ప్రతి రాయలసీమ అభిమానిపైన ఉంది. ఈ విషయమై రాయలసీమ అభిమానుల కర్తవ్య, కార్యాచరణపై నంద్యాలలో సెప్టెంబర్ 15, 2019న ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశాం. రాయలసీమ నాలుగు జిల్లాలు నుండి రైతు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా, మహిళా, న్యాయవాదుల, డాక్టర్ల సంఘం నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాయలసీమ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొనాలనివలసిందిగ విజ్ఞప్తి చేస్తున్నాం.