అదానీ, హిండెన్ బెర్గ్ నివేదికల వ్యవహారంలో ఇప్పటివరకు స్పందించని రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. మీ బ్యాంకుల నుంచి అదానీ గ్రూపు కంపెనీలు ఎంతమేరకు రుణాలు తీసుకున్నాయి, తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై మీ వివరణ ఏదైనా ఉందా తెలియజేయాలంటూ ప్రభుత్వేతర బ్యాంకులను కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంటూ.. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించింది.
ఆర్బీఐ వర్గాలు దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని తెలిపింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అదానీ గ్రూపు కంపెనీల రుణ భారం పెరిగినప్పటికీ.. 2019-22 నాటికి వీటి రుణాలు చాలావరకు స్థిరంగానే ఉన్నాయని కోటక్ ఇన్స్టి ట్యూట్ ఈక్విటీస్ తమ తాజా నోట్ లో వెల్లడించింది.
కొన్ని బ్యాంకులు తాము ఇంకా పరిశీలించవలసి ఉందని పేర్కొన్నట్టు తెలుస్తోంది. గత మూడు, నాలుగేళ్ల నుంచి బ్యాంకులకు 5 అదానీ గ్రూఫులు చెల్లించవలసిన రుణాలు ఒక లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్లవరకు పెరిగినట్టు తెలిసింది.
ఇక గురువారం కూడా స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు షేర్లు క్రాష్ అయ్యాయి. 25 బిలియన్ల విలువగల షేర్లు పతనమయ్యాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ పవర్ అండ్ అదానీ విల్మార్ షేర్లు దిగజారుతూ వచ్చాయి.