బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ మరోసారి తీపి కబురు అందించింది. మార్చి 27న రేపో రేటును 75 బేసిక్ పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ తాజాగా మరో 40 బేసిక్ పాయింట్స్ తగ్గించి 4శాతం చేసింది. తద్వారా గృహ సంబంధిత రుణాలు, వాయిదాలు మరింత తగ్గనున్నాయి.
ఇక ఇప్పటికే అన్ని రకాల రుణాలకు జూన్ 1 వరకు ఉన్న మూడు నెలల మారిటోరియాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు వరకు పొడిగించింది. వివిధ రకాల లోన్లు తీసుకున్న వారు ప్రతి నెలా చెల్లించే వాయిదాలను ఆరు నెలల పాటు కట్టకుండా వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించినట్లయింది. ఈ మేరకు ఆర్బీఐ పొడిగించిన మారిటోరియంపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయనుంది.
ఇక రెపో రేటు 4శాతానికి చేరటంతో… 3.75శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటు 3.5శాతానికి వచ్చింది.
ఇక మార్చి నెలలో పారిశ్రామిక రంగం వృద్ధి 17శాతం పడిపోయిందన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్… స్టీల్, సిమెంట్ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే ఇది ప్రపంచ దేశాల్లో 17శాతం నుండి 30శాతం వరకు ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చిన నివేదికను ఆయన గుర్తుచేశారు.