ఢిల్లీలోని జె.ఎన్.యు లో దాడికి గురైన విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్ నటి దీపికా పడుకొనే తీరును తాజాగా ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమర్ధించారు. ఆమె ఎందరికో స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ఈ మేరకు ఆయన లింక్డిన్ బ్లాగులో రాశారు. భారత్ లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన జె.ఎన్.యులో విద్యార్ధులపై దాడి జరగడం…పోలీసులు దాన్ని అడ్డుకోకపోవడం ఆందోళనకరమని రాజన్ పేర్కొన్నారు. తన సినిమా ‘చపాక్’ విడుదలవుతున్న సమయంలో జె.ఎన్.యు బాధిత విద్యార్ధులను పరామర్శించి నిశబ్ధ ఆందోళన చేపట్టిన ఆ నటి అందరికి స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.
జె.ఎన్.యు లోకి ముసుగులు ధరించి మారణాయుధాలతో ప్రవేశించిన వారు విద్యార్దులు, అద్యాపకులపై దాడి చేశారు. ఈ దాడిలో జె.ఎన్.యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు అయిషే ఘోష్ తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీపికా పడుకొనే స్వయంగా యూనివర్సిటీ కెళ్లి గాయపడ్డ విద్యార్ధుల నిరసనకు మద్దతు ప్రకటించారు. దీంతో దీపిక తీరును, ధైర్య సాహసాలను కొందరు ప్రశంసిస్తుండగా…మరోవైపు ఆమెపై తీరును తప్పు బడుతూ విమర్శించే వారూ ఉన్నారు. దీపికా అనుకూల, వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.