క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ కూడా ఓ జూదం లాంటిదేనని ఆయన అన్నారు. అందువల్ల దీన్ని నిషేధించాల్సిందేనన్నారు. క్రిప్టో కరెన్సీకి ఎలాంటి విలువ లేదని ఆయన పేర్కొన్నారు. కానీ వాటికి విలువ ఉన్నట్లుగా నమ్మిస్తున్నారని ఆయన వెల్లడించారు.
అసలు క్రిప్టో కరెన్సీ అంతా ఓ పెద్ద బూటకమని చెప్పారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ సంపదకైనా, ఆర్థిక ఉత్పత్తికైనా ఖచ్చితంగా ఓ అంతర్గత విలువ అనేది ఉండాలన్నారు.
కానీ క్రిప్టోల విషయానికి వస్తే అలాంటి విలువ ఏదీ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో విలువ అంతా అభూత కల్పనేనని ఆయన వివరించారు. మన దేశంలో జూదం ఆడేందుకు అనుమతి లేదన్నారు. జూదానికి అనుమతులు ఇవ్వాలనుకుంటే క్రిప్టోలను ఓ జూదంలాగా పరిగణించాలన్నారు.
ధనం పేరు చెప్పుకుని జూదం ఆడటాన్ని తాము అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల వృద్ధిని ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్ర బ్యాంక్ ఇటీవల తన ఈ-రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ని పైలట్ మోడ్‌లో ప్రారంభించింది.