ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.4శాతంగా అయింది. దీంతో రెపో రేటు కొవిడ్ ముందు స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడవ సారి రెపో రేట్లను పెంచింది.
జూన్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉంది. ఇది ఆర్బీఐ మధ్యకాలిక లక్ష్యం 2-6 శాతం కంటే చాలా ఎక్కువగా ఉండటంతో, ద్రవ్య విధాన కమిటీ కీలక రుణ రేటు లేదా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు 5.40 శాతానికి పెంచింది. 2019 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే అత్యధికం.
రెపో రేటును 35 పాయింట్ల వరకు పెంచే వచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరింత అధిక పెంపునకే ఆర్బీఐ మొగ్గు చూపడం గమనార్హం. కొవిడ్ సంక్షోభం తర్వాత మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్ ద్వైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులు రెపో రేటు పెంపు నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ అంచనాలను కొన్ని బ్యాంకులు ముందుగానే అంచనా వేశాయి. దీంతో ఇప్పటికే సదరు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలపై ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.