ఆటో డెబిట్ ఆప్షన్ వినియోగిస్తున్న ఖాతాదారులకు ఆర్బీఐ స్వల్ప ఊరటనిచ్చింది. మరో ఆరు నెలల పాటు పాత పద్ధతిలోనే వివిధ రకాల చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు ఆటో డెబిట్ ఆప్షన్ యధావిధిగా పనిచేస్తుంది.
ఏప్రిల్ 1 నుంచే మళ్లీ మళ్లీ జరిపే చెల్లింపులు (ఆటో డెబిట్‌కు)పై అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ రూల్ అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. మరికొంత సమయాన్ని ఇవ్వాలని ఆర్బీఐకి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఆర్బీఐ మరికొద్ది రోజుల పాటు పాతపద్ధతిలోనే చెల్లింపులకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటిచింది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలు అవుతుందని స్పష్టం చేసింది.
అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే..
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక.. చాలా మంది మొబైల్ బిల్లులు, కేబుల్, ఇంటర్నెట్, లోన్, ఈఎంఐ వంటి చెల్లింపుల కోసం ఆటో డెబిట్ ఆప్షన్ వినియోగిస్తున్నారు. అంటే సమయానికి అకౌంట్‌లో డబ్బు ఉంటే.. యధావిధిగా చెల్లింపులు జరిగిపోతాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ విధానంలో మార్పులు చేయాలని ఆర్బీఐ భావించింది. అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని బంధనను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. దీని ప్రకారం.. రూ. 5 వేల కంటే ఎక్కువ చెల్లింపులు జరపాల్సినప్పుడు ఆటో డెబిట్ నేరుగా జరగదు. నిర్ణీత తేదీకి ముందు బ్యాంక్ నుంచి కస్టమర్లకు ఓటీపీ పంపాల్సి ఉంటుంది. దాన్ని సదరు వినియోగదారుడు వెరిఫై చేస్తేనే.. ఆటోడెబిట్ ప్రక్రియ పూర్తవుతుంది.