రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 6.5 శాతానికి పెంచింది. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. ఫలితంగా కీ ఇంట్రెస్ట్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరుగుతాయన్నారు. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఈ పెంపుదలకు అనుకూలత వ్యక్తం చేశారని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితిని కూడా వీరు పరిగణనలోకి తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇలా రెపో రేటును పెంచడం వరుసగా ఇది ఆరోసారి.
తాజాగా ఈ పెంపుదల ‘చర్య’తో ఆయా లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా ఈ భారాన్ని ఇవి నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తాయి. రుణ ఆధారిత వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో తక్షణమే ఆయా రుణాలపై ఆటోమేటిక్ గా వీటి పెంపు వర్తిస్తుంది. చెల్లించాల్సిన ఈఎంఐలు పెరుగుతాయి కూడా. వర్తమాన ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.6 శాతంగా నమోదు కావచ్చునని అంచనా వేశామని శక్తికాంత దాస్ తెలిపారు.
ఇదే సమయంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 6.4 శాతంగా అంచనా వేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా ఆ యా దేశాల ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
గత మూడేళ్ళుగా గ్లోబల్ గా జరిగిన (కనీవినీ ఎరుగని) పరిణామాలు ద్రవ్యపరపతి విధానానికి సవాలుగా మారాయన్నారు. అయితే మన దేశ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలోనుంచుకుని ఆర్బీఐ.. ఎప్పటికప్పుడు గట్టి ‘నిఘా’ కొనసాగిస్తుందన్నారు. ఏమైనప్పటికీ ఇటీవలి కాలంలో గ్లోబల్ ఎకనామిక్ ఔట్ లుక్ మరీ ‘ఘోరంగా’ కనబడడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలివరకు రెపో రేటు 6.25 శాతంగా ఉంది. కానీ అంతా ఊహించినట్టుగానే తాజాగా ఈ రేటును ఆర్బీఐ పెంచింది.