రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెపో రేటను 40 బేసిస్ పాయింట్ల మేర పెంచి.. 4.4శాతంగా నిర్ణయించినట్లు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని.. దాని ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని వివరించారు. రేట్ల పెంపునకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు వెల్లడించారు.
టోకు ద్రవ్యోల్బణం మార్చిలో 6.9శాతంగా నమోదైందని గుర్తు చేసిన ఆర్బీఐ గవర్నర్.. ఏప్రిల్‌లో కూడా ఇది ఎక్కువగానే ఉండే సూచనలు కన్పిస్తున్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం గత మూడు నెలలుగా నిర్దేశిత లక్ష్యం 6శాతం కంటే ఎక్కువగా ఉందని ప్రకటించారు.
నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిస్ పాయింట్లు పెంచి.. 4.5 శాతంగా నిర్ణయించినట్లు గవర్నర్ ప్రకటించారు. మే 21 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ. 87,000 కోట్ల లిక్విడిటీ రూపంలో తీసుకోనున్నట్టు ప్రకటించారు. సీఆర్ఆర్ అంటే బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో లిక్విడ్ క్యాష్‌ను మెయింటెన్ చేయాల్సిన శాతమని అయన స్పష్టం చేశారు.
2020 మే 22న చివరిసారిగా ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. దీని ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4శాతానికి దిగొచ్చింది. ఆ తర్వాత వరుసగా 11 సార్లు ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగినా.. వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది రిజర్వ్ బ్యాంక్.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటనతో మదుపర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిమిషాల వ్యవధిలోనే భారీ స్థాయిలో అమ్మకాలకు దిగారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా క్షీణించి 55,910 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 340 పాయింట్లు తగ్గి.. 16,730 వద్ద కొనసాగుతోంది.