బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా అత్యధిక మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి న 100 మంది జాబితాను ఎట్టకేలకు ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులు ఎవరెవరికి ఎంత మొత్తంలో రుణాలు రద్దు చేశాయో తెలిపింది. 2020 మార్చి నాటికి దేశంలో 100 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన 62,000 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందులో అత్యధికంగా జతిన్ మెహతాకు సంబంధించిన విన్సమ్ డైమండ్స్ & జ్యువెలరీ సంస్థ అత్యధికంగా రూ .3,098 కోట్లు ఎగ్గొట్టగా.. బాస్మతి బియ్యం తయారీదారు ఆర్‌ఇఐ ఆగ్రోకు సంబంధించి రూ .2,789 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయని తెలిపింది.
ఇక కుడోస్ కెమీ రూ. 1,979 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ. 1,927 కోట్లు, ఓడల నిర్మాణ సంస్థ ఏబీజీ షిప్‌యార్డ్ రూ .1,875 కోట్లు , విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు 1,314 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
ఆర్టీఐ కార్యకర్త విశ్వనాథ్ గోస్వామి సమాచార చట్టం కింద దరఖాస్తు చేయగా.. ఈ వివరాలను ఆర్బీఐ బయటపెట్టింది. కాగా గతంలోనే ఈ వివరాలను ఇవ్వాలని విశ్వనాథ్ కోరారు. అయితే ఆవివరాలు తమ వద్ద లేవని ఆర్బీఐ గత ఆగస్టు 12న సమాధానం ఇచ్చింది. దీంతో ఆయన అప్పీలేట్‌కు వెళ్లారు. దీంతో అప్పిలేట్ ఆదేశాలకు అనుగుణంగా ఈ వివరాలను వెల్లడించింది. కాగా 2015 లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విదేశాలలో ఉన్న రుణగ్రహీతలపై వివరాలను మాత్రం వెల్లడించలేదు.