క్రిప్టో కరెన్సీపై పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ కోసం నిబంధనలు రూపొందించాలని, దాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆర్బీఐ కోరినట్టు ఆమె వివరించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో క్రిప్టో కరెన్సీని నిషేధించడం కుదరని ఆమె తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా ఇతర దేశాల సహాయంతోనే అది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. లేని పక్షంలో క్రిప్టో కరెన్సీపై పై చేయి సాధించలేమంటూ వ్యాఖ్యానించారు.
లోక్ సభలో క్రిప్టో కరెన్సీపై ఎంపీ తిరుమావళవన్ థోల్ ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి ఆర్థిక మంత్రి కూలంకుషంగా సమాధానం ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే దానిపై క్రిప్టో కరెన్సీలపై ప్రభావాన్ని తగ్గించాలని ఆర్బీఐ సూచించినట్టు ఆమె వెల్లడించారు.
క్రిప్టో కరెన్సీలను నిషేధించడం భారత్ కు అత్యంత అవసరమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడాలంటే క్రిప్టో కరెన్సీలను నిషేధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.