పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం వెయ్యి రూపాయలకు బదులుగా 2వేల రూపాయల నోటును తీసుకొచ్చింది. నగదురహిత లావాదేవీలను ప్రొత్సహిస్తూనే… 2వేల రూపాయలను తీసుకరావటంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
అయితే… 2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ క్రమంగా తగ్గించేస్తుంది. 2016–17లో 354.29 కోట్ల 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
కానీ 500నోట్ల రూపాయల ప్రింటింగ్ ను మాత్రం భారీగా పెంచేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల 500నోట్లను ముద్రించగా.. గత ఆర్థిక సంవత్సరంలో 822.77 కోట్ల నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి.
ఇదే సమయంలో 10,5,20 రూపాయలు వంటి చిన్న నోట్లను ముద్రించటం కూడా ఆర్బీఐ తగ్గించింది. ఆర్థికభారంగానే చిన్న నోట్లను తగ్గించినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 200 నోటు ప్రింటింగ్‌కు 2.15 రూపాయలు, 500 నోటుకు రూ. 2.13, 100 నోటు ముద్రణకు 1.34 రూపాయలను ఆర్బీఐ ఖర్చు చేసింది.