ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్ లో అజేయ సెంచరీతో ఓ మెరుపులా మెరిశాడు యువ ప్లేయర్ రజత్ పటీదార్. వేలంలో తనని పట్టించుకోని టీం ప్రాంచైజీలకు తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. అవకాశమిచ్చిన జట్టుకు అద్భుత సెంచరీతో రుణం తీర్చుకున్నాడు. అయితే.. ఈ శతకంతో పటీదార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్ర లో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్ గా గుర్తింపు పొందమే కాకుండా.. 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని వృద్దిమాన్ సాహా రికార్డును సమం చేశాడు పటీదార్. ఐపీఎల్ లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ గా నిలిచాడు.
మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్‌వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0) విఫలమై నిరాశపరిచిన సమయంలో.. పటీదార్ జట్టుకు ఊపిరయ్యాడు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత సీజన్ లో ఆర్‌సీబీకే ఆడిన పటీదార్.. పెద్దగా రాణించలేదు. దాంతో అతన్ని వదిలేసిన ఆర్‌సీబీ.. మళ్లీ కొనుగోలు చేయలేదు. కనీసం ఎక్స్‌ట్రా ప్లేయర్ గా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
అయితే.. జట్టులోని యువ ప్లేయర్ లువ్‌నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్ లో రీప్లేస్ మెంట్ గా తీసుకుంది ఆర్సీబీ. ఆరంభ మ్యాచ్ ల్లో అనూజ్ రావత్ కు అవకాశం ఇచ్చిన ఆర్‌సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్ గా ప్రమోట్ చేసి.. పటీదార్ ను ఫస్ట్ డౌన్ లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పటీదార్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న పటీదార్.. సన్‌రైజర్స్‌పై 48 పరుగులు చేశాడు.
ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పటీదార్.. ఆర్‌సీబీ విజయాల్లో కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం పటీదార్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. అయితే.. ఛాంపియన్ షిప్ అందుకోవడానికి రెండు అడుగులో దూరంలో ఉన్న ఆర్సీబీకి పటీదార్ ఓ పటిష్టం కావాలంటున్నారు ఆర్సీబీ అభిమానులు.