ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అదృష్టం వరించింది. ప్లే ఆఫ్స్ రేసులో తమకు గట్టి పోటీనిచ్చిన ఢిల్లీ ఇంటిబాట పట్టడంతో ఆర్సీబీకి ఐపీఎల్-2022లో ముందుకు వెళ్లే అవకాశం లభించింది. వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ దక్కించుకుంది ఆర్సీబీ.
దీంతో తాము ఆడి గెలిచినప్పుడు కూడా లేనంతగా సంబరాలు జరుపుకున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఢిల్లీ-ముంబై మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించింది డుప్లెసిస్ సేన. ముంబై గెలుపు ఖరారు కాగానే ఎగిరి గంతేసింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సహచర ఆటగాళ్లను ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ సహా సిరాజ్ తదితర ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. జట్టు వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడంతో గెంతులేస్తూ సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లి తనదైన శైలిలో ముంబైకి థాంక్స్ చెప్తూ.. తాము కోల్‌కతా వెళ్తున్నామంటూ ఫ్లైట్ ఎమొజీతో ట్వీట్ చేశాడు. కాగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్.. ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి విజయంతో సీజన్‌ను ముగించింది. ఇక ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.