ఐపిఎల్ టోర్నీలో ఒక్కసారి కూడా కప్ గెలవకపోయినా సరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక సంచలనం. అగ్ర శ్రేణి ఆటగాళ్ళతో ఆ జట్టు ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. విరాట్ కోహ్లీ సారధ్యంలో ఈసారైనా సరే కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది ఆ జట్టు. ఇక ఈ జట్టుకి ఒక ప్రత్యేకత కూడా ఉన్న సంగతి విదితమే. టోర్నీలో అప్పుడప్పుడు గ్రీన్ జెర్సీ ధరిస్తూ ఆటగాళ్ళు మ్యాచ్ లు ఆడుతూ ఉంటారు.
అయితే ఈసారి మాత్రం వినూత్నంగా ఆలోచించింది ఈ జట్టు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తూ తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెప్టెంబర్ 20 న అబుదాబిలో జరిగే మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ జెర్సీని ధరించనుంది.
ఫ్రంట్ లైన్ కార్మికులు ధరించే పీపీఈ కిట్ రంగు రంగును పోలి ఉండే బ్లూ జెర్సీని టీంలోని ఆటగాళ్ళు ధరిస్తారు. వారి సేవలకు గానూ నివాళి అర్పించేందుకు టీం యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించారు. కిట్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడే ఆటగాళ్ల వీడియోను ఫ్రాంచైజీ విడుదల చేసింది. డివిలియర్స్, సచిన్ బేబీ, నవదీప్ సైనీ మరియు దేవదత్ పాడిక్కల్ కొత్త జెర్సీ ధరించి వీడియోలో కనిపిస్తున్నారు. పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు గానూ గతంలో గ్రీన్ జెర్సీని ధరించే వారు.
Advertisements