ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసుపై సీబీఐ విచారణలో మరో ముందడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె మృతదేహానికి మరోసారి శవపరీక్ష జరపుతున్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున ఆధారాల సేకరణ సీబీఐకి పెద్ద సవాల్‌గా మారింది. అందుకే మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియ ముస్లిం మత సంప్రదాయలకు విరుద్ధమని అయేషామీరా తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో సీబీఐ అధికారులు కోర్టుని అశ్రయించి అనుమతి పొందారు. తెనాలిలోని చెంచుపేటలో ఉన్న స్మశానవాటికలో అయేషా మృతదేహాన్ని ఖననం చేశారు. ఇపుడు అక్కడే మరోసారి శవపరీక్ష జరగుతోంది. అయితే హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత శవపరీక్ష జరుగుతున్నందున మృతదేహం పూర్తిగా పాడైపోయి ఉంటుంది. కేవలం ఎముకలు, గోళ్లు, కేశాలు మాత్రమే ఉంటాయి. ఇపుడు శవపరీక్షలో మృతదేహం ఆనవాళ్ల నుంచి సీబీఐ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారనేది ఆసక్తిగా మారింది.