భూమిని నమ్ముకున్నోడు బాగుపడతాడు.. అమ్ముకున్నోడు అడుక్కుతింటాడు అనే సామెత ఉంది. స్టాక్ మార్కెట్ ని మించి దందా నడిచేది.. రియల్ ఎస్టేట్ మీదే. అందులో మనలాంటి ఫ్యూడల్ వ్యవస్ధ నుంచి బయటపడి.. ప్రజాస్వామ్య దేశంగా మారినా.. ఇంకా ఆ ఆనవాళ్లు అలాగే ఉండిపోయిన సిస్టమ్.. భారతదేశంలోనే ఉంది. ఏపీలో సంగతి వేరే చెప్పనక్కర్లేదు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే.. ఆ భూమి చుట్టూ మన రాజకీయ నేతలంతా తిరుగుతుంటారు. ఏ కుంభకోణం తీసుకున్నా దాని వెనక భూమి ఉంటుంది.. ఏ హత్య తీసుకున్నా.. దాని వెనక భూమి ఉంటుంది. ఒకడు పడిపోవాలన్నా.. మరొకడు లేవాలన్నా.. అంతా భూమాయ మీదే ఉంటుంది.
ఇళ్ల స్ధలాలు, బిల్డ్ మిషన్ ఏపీ తో చేసిన యవ్వారం చాలదన్నట్లు.. ఇప్పుడు జగన్ సర్కార్ భూసమగ్ర సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ తంతు నడుస్తుందని జగన్ ప్రకటించారు. అదేంటి సర్వే చేస్తే మంచిదే కదా .. అనొచ్చు. కాని ఎన్నిసార్లు సర్వే చేస్తారు.. ఎవరికి అనుకూలంగా సర్వే చేస్తారు అది కదా కీలకం.
ఆల్రెడీ.. చంద్రబాబునాయుడు ఉన్నప్పుడే భూదార్ అనే పథకం ప్రారంభించారు. మనిషికి ఆధార్ లాగా.. భూమికి భూదార్ అని చెప్పారు. దీని కోసం జగ్గయ్యపేట మండలంలోనే పైలెట్ ప్రాజెక్ట్ మొదలెట్టారు. దాని తర్వాత అన్ని చోట్లా చేయాలని అనుకున్నారు. చుక్క భూములనే వ్యవహారం అప్పుడే తెరపైకి వచ్చింది. తెలుగుదేశం నేతలు చాలామంది అప్పట్లో చుక్క భూముల పేరుతో బాగానే దందా చేశారు. ఇప్పుడు వైసీపీ దందా మొదలు కాబోతుంది.
విచిత్రం ఏంటంటే.. వీరు కూడా జగ్గయ్యపేట మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించినట్లు చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆ సర్కార్ చేసిన పైలెట్ ప్రాజెక్ట్ ను.. మళ్లీ వీరు చేసినట్లు ఫైల్ క్రియేట్ చేసి.. దాని ఆధారంగా ఇప్పుడు రాష్ట్రమంతా చేయబోతున్నారు. ఇక చూసుకోండి.. ప్రత్యర్ధుల సర్వే నెంబర్లు కనపడవు.. వాటి నెంబర్లు మారిపోతాయి. సర్కారు భూముల సర్వే నెంబర్లు మారిపోయి.. అస్మదీయుల సర్వే నెంబర్లలోకి వెళ్లిపోతాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నంతగా రియల్ వ్యాపారం నడవబోతుంది.
టీడీపీ నేతలు, వైసీపీ నేతల మాటల వినని వ్యాపారుల భూములు సర్వేల్లో సరిగ్గా కనపడాలంటే బాగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక అధికారులు కళ్లు మూసుకుని.. చెవులు మూసుకుని.. సర్కారీ భూములు వైసీపీ నేతలవే అని సర్వే రిపోర్టు వచ్చినా.. సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక దీని మీద ప్రతిపక్షాల రగడ.. అధికార పక్షం దబాయింపు అన్నీ కామన్ గానే జరుగుతాయి. ఏది ఏమైనా మరో భూకంపం తప్పదు.