తెలంగాణ పాలకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బాగా రుణపడిపోతున్నారు. కేటీఆర్ పదేపదే చెప్పే ‘గ్లోబల్ ఇమేజ్’ హైదరాబాద్‌కు అమాంతం ఇప్పుడొచ్చింది. అది కూడా జగన్ వల్ల వచ్చింది. ఏపీలో బాగా పడిపోయిన భూముల క్రయ విక్రయాలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యాయి. ఇక్కడ భూములు కొనాలని భావించి ప్రస్తుత పరిస్థితి చూసి వెనకడుగువేస్తున్న ఇన్వెస్టర్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక, కొత్త రాజధానిలో ఎలాగైనా సరే ఇల్లో, ఇళ్ల స్థలమో తీసుకోవాలని నిన్నటిదాకా ప్లాన్ చేసిన ఎగువ మధ్యతరగతి జనం ఇప్పుడు హైదరాబాద్ వైపు దృష్టి సారించారు. దాంతో హైదరాబాద్‌లో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. అమరావతి పరిసరాల్లో భూముల రేట్లు బీభత్సంగా తగ్గిపోతే.. హైదరాబాద్ చుట్టుపక్కల అనూహ్యంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కలు తీస్తే ఈ విషయం బాగా అర్ధం అవుతుంది.
హైదరాబాద్ ఆదిభట్ల ⇑ అమరావతిలోని మంగళగిరి ప్రాంతం ⇓
గుంటూరు: రాజధాని అమరావతి, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్‌ఎస్టేట్ రంగం కుదేలయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని మరంత ముందుకు తీసుకుపోవడానికి అంత ఆసక్తి చూపడం లేదని వస్తున్న వార్తలు, ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలు, రైతుల ఆందోళనల నేపథ్యంలో కొనేవాళ్లు లేక రియలెస్టేట్ బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయ విక్రయాల గణాంకాలు చూస్తే ఈ విషయం బాగా అర్ధం అవుతుంది. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా వున్నాయని అధికారులు చెబుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల కంటే ముందే రాజధానిలో భూముల క్రయ విక్రయాలు దాదాపు నిలిచిపోయాయి. తర్వాత రీసెంటుగా జరిగిన పరిణామాలతో ఈ రంగం కుప్పకూలింది. చంద్రబాబు హయాంలోనే అసలు ఈ సమస్య తలెత్తిందని రియల్ రంగ వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో అంతులేని జాప్యం చేస్తుండటం, ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రహదారి, అర్టీయల్ రహదారులను సకాలంలో పూర్తిచేయకుండా వదిలేయడం, ఇంతలో ఎన్నికలు ముంచుకురావడం.. కారణాలుగా ఈ ప్రాంతంలోని స్థిరాస్తుల విలువ రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. ఐతే, ఎన్నికల సమయం దగ్గరపడిన సందర్భంలో మధ్యలో కాస్త పుంజుకుంది. భూములు, ఇతర స్థిరాస్తుల విలువ కాస్త పెరిగింది. ఆ తరువాత చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడంతో ఇంకాస్త పెరిగి కొద్దిగా ఊపొచ్చింది. అది ఎంతో కాలం లేదు. ఒక్క నెల మాత్రమే స్థిరంగా వుంది. ఇక, ఫలితాలు వెలువడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకూ ధరలు కుప్పకూలుతూ వచ్చాయి. అమరావతిలో రాజధాని కొనసాగడం జగన్‌కు ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం ముమ్మరంగా జరగడంతో రియల్ వ్యాపారం ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఒక్కసారి కూడా అమరావతి పేరు ప్రస్తావించకపోవడం ఎన్నో సందేహాలకు తావిచ్చింది. దానికితోడు నిర్మాణంలో ఉన్న భారీ భవంతులు, ఇతర కట్టడాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఈ ప్రభుత్వానికి అమరావతి కొనసాగించడం పట్ల ఆసక్తి లేదని అందరికీ అర్ధమైంది. దానికిసాయం రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తారన్న వదంతులు వ్యాప్తిచెందడంతో బిజినెస్ మరింత కుదేలయ్యింది.
ముఖ్యంగా రాజధాని ప్రాంత గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు బాగా తగ్గాయి. భూములు, ఆస్తులు కొనడానికే ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు ఒక నెల రోజుల్లో అమ్ముకున్నవాళ్లు లాభపడ్డారు. కొన్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
రాజధాని గ్రామాల్లో భూమి విలువ ఒక దశలో గజం 30 వేల వరకు పలికింది. ఎన్నికల ముందు రూ.22 వేల వరకు చేరింది. క్రమక్రమంగా ఆ ధర రూ.16 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఆ ధర కూడా అడిగేవారు లేరు. తాడికొండ మండలంలో భూముల విలువ ఎకరా కోటి రూపాయల నుంచి రూ.60 లక్షలకు పడిపోయింది. పెదకూరపాడులో ఎకరం 35 లక్షల నుంచి 25 లక్షలకు పడిపోయింది.
మంగళగిరికి వచ్చేసరికి జాతీయ రహదారి పక్కన ఉండటం వల్ల ఇక్కడ ఎప్పుడూ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక్కడ కూడా భూమి గజం ధర రూ.30 వేల నుంచి రూ.25 వేలకు పడిపోయింది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. స్థానికంగా ఉన్నవారే ఒకరిద్దరు, అదికూడా కాస్త తక్కువ ధరకు దొరికితే కొనుగోలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చి కొనుగోలు చేసేవారే లేరు.
అమ్మేవారు కూడా ఇప్పుడు ఇంత తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఏముందిలే అని సరిపెట్టుకుంటున్నారు. రాజధాని విషయం అటోఇటో తేలేవరకు ఆగుదామన్న ఆలోచన వారిలో ఉంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అమరావతి రాజధానిగానే వుంటుందని, ఇక్కడి నుంచి ఎక్కడికీ కదలదని, అవసరమైతే తాను ప్రధానమంత్రి మోడీని కలిసి మాట్లాడతానని భరోసా ఇవ్వడంతో రైతులు కాస్త రిలీఫ్‌గా ఉన్నారు. మళ్లీ ఇక్కడ రేట్లు పెరగక తప్పదన్న అంచనాతో వారున్నారు. ఇంతవరకు వచ్చాక రాజధానిగా అమరావతిని అనివార్యంగా కొనసాగించాల్సిందేనన్న అభిప్రాయం వారిలో ఉంది.
ప్లాట్ల బిజినెస్ ఎలా వున్నప్పటికీ ఫ్లాట్ల విషయం మాత్రం ఘోరంగానే ఉంది. ప్లాట్లుగా వేసిన స్థలాలకు ఎప్పటికైనా మార్కెట్ వుంటుంది. ఈరోజు కాకపోతే కొన్నేళ్ల తరువాత అయినా అమ్ముకుంటే అప్పుడు రేట్లు బాగా వుండచ్చు. అదే అపార్టుమెంట్ల విషయం వేరు. కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. అప్పులు తెచ్చి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన బిల్డర్లు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఆ ప్రభావం అపార్టుమెంట్ ధరలపై పడింది. వడ్డీలకు తెచ్చి నిర్మాణాలను పూర్తి చేసిన బిల్డర్లు ఇప్పుడు అయినరేటుకు అమ్మేస్తున్నారు. ఆఫర్లు ప్రకటించి మరీ అపార్టుమెంట్ ఫ్లాట్లు అమ్మేసుకుంటున్నారు.
గతంలో రూ.45 లక్షలకు అమ్మిన ఫ్లాట్ ధర ప్రస్తుతం రూ.35 లక్షలకు పడిపోయింది. అసలు ఆ ధరకు కూడా కొనేవారు లేరు. దానికి తోడు ఇసుక దొరకడం ఇప్పుడు బాగా కష్టమైపోయింది. ఎన్నికల ముందు ట్రాక్టర్ ఇసుక ధర రూ.1600 ఉండగా, ప్రస్తుతం రూ.6వేలకు పెరిగింది. దాంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది.
కొత్తగా అపార్టుమెంట్లు నిర్మించే బిల్డరే కనిపించడం లేదు. కొత్తగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలుపెట్టిన కొంతమంది బిల్డర్లు ఆరంభలోనే వాటిని ఆపివేశారు. ముందుకు తీసుకెళ్లడానికి వారికి ధైర్యం చాలడంలేదు. ఓ మోస్తరు నిర్మాణ దశలో ఉన్న అపార్టుమెంట్లను మాత్రం ఎలాగో అలాగ అమ్మేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి రాజధాని ప్రాంతంలో కనిపిస్తోంది. ఫ్లాట్లు అమ్ముదామంటే కొనేవారు ఎక్కడా కనిపించడం లేదు.
ఇక విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేసరికి అక్కడ భూమి, స్థిరాస్తుల ధరలలో పెద్దగా మార్పులేదు. అక్కడ స్వల్పంగా తగ్గుదల మాత్రమే కనిపిస్తోంది. రాజధాని ప్రాంత గ్రామాలతో పాటు, ఆ చుట్టుపక్కల తాడికొండ, పొన్నెకల్లు, రావెల, పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు తదితర గ్రామాలలో భూములు కొనుగోలు చేసినవారు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఆ రకంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా స్సష్టమైన అధికారిక ప్రకటన చేయకపోతే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు ప్రమాదరక పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ రంగానికి చెందిన పెద్దలు అభిప్రాయపడుతున్నారు.