– క్యాష్ బ్యాక్ అంటూ కహానీలు
– 20 నెలల్లో రెట్టింపు సొమ్మంటూ ఎర
– రూ.40వేల భూమి రూ.4 లక్షలకు అమ్మకం
– జోగిపేట్, నారాయణ్ ఖేడ్ అడ్డాగా మోసాలు
– వెల్త్ క్యాపిటల్ సర్వీస్ పేరుతో ఎట్రాక్షన్
– అప్రమత్తం చేస్తున్న తొలివెలుగు
క్రైం బ్యూరో తొలివెలుగు.
క్రైంబ్యూరో, తొలివెలుగు:హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలకు కొదువ లేదు. కల్లబొల్లి కబుర్లు చెప్పి డబ్బులు లాగేస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. అలాంటి మోసగాళ్లను తొలివెలుగు ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సాక్ష్యాధారాలతో సహా అధికారులకు అందించి చర్యలు చేపట్టేలా చూస్తోంది. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును కాపాడే దిశగా అలోచన చేస్తోంది తొలివెలుగు.
12 వెల్త్ క్యాపిటల్ కాన్సెప్ట్ అదుర్స్
కూకట్ పల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకుని 10 మంది మార్కెటింగ్ సిబ్బందిని నియమించుకుని ఓ అద్భుతమైన ఐడియా వేశారు 12 వెల్త్ క్యాపిటల్ ఓనర్ కళానిధి పవన్ కుమార్. గతంలో ఈయన మల్టీ లెవల్ మార్కెటింగ్ లో పని చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్ గా సర్వీస్ అందించారు. ఓ కొత్త అలోచనతో లీగల్ అంటూ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. ఆ ఇంటికి ఎలాంటి ఊరూ పేరూ ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కొనసాగుతోంది. 2 గుంటల భూమికి రూ.8 లక్షల పెట్టుబడి పెడితే 20 నెలల్లో రూ.16 లక్షలు ఇస్తారట. ఇందుకు సెక్యూరిటీగా 2 గుంటల భూమిని 80 వేల ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కానీ, ఆ భూమి విలువ రూ.80 వేలు కూడా ఉండకపోవడం అశ్చర్యానికి గురిచేస్తోంది.
నెలకు రూ.40 వేల చొప్పున రూ.8 లక్షలు ఇచ్చి ఆ భూమిని మళ్లీ తమకే అమ్మేయాలంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అప్పుడే మిగిలిన రూ.8 లక్షలు ఇస్తారట. ఇప్పటికే నారాయణఖేడ్ వద్ద గూడూర్ లో 15 ఎకరాలు అమ్మేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాంటి రోడ్లు, పార్క్ ప్లేస్ లేకుండా 15 ఎకరాలకు రూ.20 కోట్లు వసూలు చేశారు. అక్కడ ఎకరం రూ.20 లక్షలకు మించి ఉండదు. మనీ బ్యాక్ అంటూ ప్రజలకు భూమి అంటకట్టి డబ్బులు పోగు చేస్తున్నారు. ఇలా సదాశివపేట్ మండలం నిజాంపల్లిలో 10 ఎకరాలు అమ్మారు. ఇప్పుడు జోగిపేటలో 50 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. అది కస్టమర్స్ వద్ద నుంచి పూర్తిగా డబ్బులు తీసుకున్న తర్వాతనే సైట్ చూపిస్తారు. ఆ 10 ఎకరాల్లో ఎక్కడ ఉంటుందో స్పష్టత ఇవ్వరు. కానీ, వడ్డీతో కలిపి 2 ఏండ్లలోనే పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పడం మోసపూరితమైన వడ్డీ వ్యాపారమే అవుతుంది.
ఏజెంట్లకు సగం డబ్బులు
కస్టమర్లను బుట్టలో వేసుకుని పెట్టుబడి పెట్టిస్తే వారికి నెలకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఏజెంట్లను నియమించుకుంటున్నారు. సబ్ ఏజెంట్లకు డబ్బులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలు జమచేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండా గుంటల్లో భూములు కొనుగోలు చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయి. కానీ, వీటన్నింటినీ సెటిల్మెంట్స్ చేయడానికి ఒప్పంద పత్రంలోనే ఆర్బిట్రేటర్ గా హైకోర్టు న్యాయవాది చొక్కల నాగరాజు పేరును ప్రస్తావిస్తున్నారు. అంటే, ఎప్పటికైనా సెటిల్మెంట్స్ చేసుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోంది.
వెబ్ సైట్ తో అరచేతిలో స్వర్గం
WWW.WEALTHCAPITALSERVICES.COM పేరుతో బుల్, ఈ-కామర్స్, ఫండ్స్, గోల్డ్, గ్రోత్, ఇన్సూరెన్స్, మై ప్రాఫిట్, మై షేర్స్, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, యుటిలిటీ తాము బిజినెస్ చేస్తున్నామని చెబుతున్నారు. బిజినెస్ ఎలా చేస్తారో వివరాలు ఓపెన్ కావు. లాగిన్ ఐడీ ఇస్తేనే ఇన్వెస్ట్ మెంట్ లేదా ఏజెంట్ గా చేస్తేనే ఎంట్రీ ఉంటుంది.
ఈ కలర్ ఫుల్ వెబ్ సైట్ తో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొంటున్నారు. భూముల పేర్లతో, గోల్డ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధం. భూమిని ఊహించని అధిక ధరకు కొనుగోలు చేయించి, డబ్బులు రిటర్న్ ఇస్తామని అగ్రిమెంట్స్ చేయించడం చెల్లదు. 20 నెలల్లో తామే భూమిని తీసుకుంటామనడం చట్టంలోని లొసుగులను వాడుకోవడమే.
అప్రమత్తతే శ్రీరామ రక్ష
మహా నగరంలో అగ్రికల్చర్ భూములు కొనుగోలు చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఫామ్ ల్యాండ్ అంటూ అమ్మకాలు జరపవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయ భూమి కనీసం 20 గుంటలు కొనుగోలు చేయాలని రూల్స్ పెట్టింది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా అధికారులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి దారీ లేని భూములను, కొండలను చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. సో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా చట్టపరంగా చూసి కోనుగోలు చేసుకోవాల్సి వుంటుంది.
2 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం- తహశీల్దార్
రైతులు నేరుగా అమ్మకం జరిపితే 2 గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అన్నారు సదాశివ పేట్ తహశీల్దార్. మున్సిపాలిటీ పరధిలో రాని వ్యవసాయ భూములకు ఎలాంటి దారి లేకుండానే గుంటల్లో రిజిస్ట్రేషన్ జరుపుతున్నామని తెలిపారు.