– బడా నేతల మాటున భూదందా
– బెదిరింపులతో రైతుల భూములు కబ్జా
– చౌటుప్పల్ లో తిష్ట వేసిన రియల్ మాఫియా
– అమిత్ షా, కేటీఆర్ పేర్లు వాడేస్తూ దందా
– పెద్దల్ని సైతం బురిడీ కొట్టిస్తూ మోసాలు
– ఎపిటోం గుట్టంతా తెలుసుకున్న తొలివెలుగు
క్రైంబ్యూరో, తొలివెలుగు:అమాయక రైతులకు బెదిరింపులు.. బడాబాబులకు దగ్గరంటూ బిల్డప్పులు.. అమిత్ షా, కేటీఆర్ దగ్గరంటూ కబుర్లు.. ఏకంగా సీపీ మహేష్ భగవత్ ని, అడిషనల్ సీపీ సుధీర్ బాబుని గుప్పిట్లో పెట్టుకుని ఆటలు. ఇదంతా చౌటుప్పల్ లో సాగుతున్న రియల్ మాఫియా దందా. తొలివెలుగు క్రైంబ్యూరో ఆపరేషన్ లో ఈ గుట్టంతా బయటపడింది. చౌటుప్పల్ చుట్టుపక్కల రైతులను నయానో కాదు.. భయానే ఎకరాలకు ఎకరాలు తక్కువ ధరకు కొట్టేస్తున్నారు రియల్ వ్యాపారులు. మొత్తం 1200 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని చూసినా.. మరో 200 రైతుల చేతిలో ఉండడంతో మొత్తం ఖతం పట్టించేందుకు పావులు కదులుతున్నారు.
అసలు ఈ కథేంటి?
ఉత్తర ప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి అనుచరులు వీరంతా. 2008 నుంచి 2012 వరకు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. క్లైడ్ టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తగడపల్లి సర్వే నెంబర్ 646, 647, 648, 664, 665, 666లోని 37 ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ 1285తో కొన్నారు. గురు తేజ్ బహదూర్ డెవలపర్స్, వేవ్ లేక్ ఉడ్ పేరుతో 85 ఎకరాలు, మేఘా బిల్డ్ మార్ట్ అంటూ 51 ఎకరాలు, మికా టౌన్ ప్లానర్స్ పేరుతో 43 ఎకరాలు, మాల్ బెర్రీ హౌజింగ్ ఎల్ డి పేరుతో 52 ఎకరాలు, నెల్సన్ హౌజింగ్ అండ్ ల్యాండ్ ఎసీ డెవలపర్స్ అంటూ 49 ఎకరాలు, ఒమేగా టౌన్ ప్లానర్స్ పేరుతో 43 ఎకరాలు, ఆర్చిడ్ బిల్డ్ వెల్ అంటూ 76 ఎకరాలు, పవన్ టౌన్ ప్లానర్స్ తో 47 ఎకరాలు, పీస్ బిల్డ్ మార్ట్ పేరుతో 52 ఎకరాలు రేమిన్ టౌన్ ప్లానర్స్ అంటూ 49 ఎకరాలు, రూబియా టౌన్ ప్లానర్స్ తో 50 ఎకరాలు, సరస్వతి బిల్డ్ మార్ట్ పేరుతో 54 ఎకరాలు, స్నోబెర్రీ టౌన్ ప్లానర్స్ అంటూ 30 ఎకరాలు, విక్టరీ ఇన్ఫ్రా బిల్డ్ తో 14 ఎకరాలు, గోల్డ్ ఫోల్ ప్లానర్స్ పేరుతో 48 ఎకరాలు.. ఇలా సెల్ డీడ్ 742 ఎకరాలు కాగా.. జీపీఏ హోల్డర్స్ తో 175 ఎకరాలు తంగడపల్లిలో పాగా వేశారు. డి నాగారంలో సెల్ డీడ్ ద్వారా 56 ఎకరాలు, జీపీఏ ద్వారా 75 ఎకరాలు ఇలా మొత్తం 1048 ఎకరాలు తమ చేతిలో ఉంచుకున్నారు. ఇందులో మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే చేతిలో 275 ఎకరాలు ఉంది. భూదాన్ పట్టా, సీలింగ్ పట్టా భూములు వీరు కొనుగోలు చేసిన భూముల్లో ఉన్నాయి. వీటన్నింటిని ఎలాగోలా చేజిక్కించుకొని పోవాలనేదే వారందరి లక్ష్యంగా కనిపిస్తోంది.
వీరేశం కుటుంబ గొడవతో అంతా వెలుగులోకి!
సర్వే నెంబర్ 687లో 2ఎకరాల 10 గుంటల భూమి కబ్జా చేశారని ఎపిటోం కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కొందరు. లిటిగేషన్ ప్రాపర్టీ అంటూ పోలీసులు సీఆర్పీసీ 145 అమలు ఉందని అక్కడికి ఎవ్వరూ వెళ్లవద్దని చెబుతున్నారు. వారు వెళ్లారు కాబట్టి గొడవ జరిగిందని అంటున్నారు. బౌన్సర్ ని పెట్టి విరేశం కుటుంబాన్ని చితకబాదారు. మళ్లీ పోలీసులు వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. దీంతో 1200 ఎకరాల భూమి కథేంటో తొలివెలుగు క్రైంబ్యూరో ఆరా తీసింది. సర్ ప్లేస్ ల్యాండ్ ని దున్నుకుంటున్న రైతుల నోట్లో మట్టికొట్టి భూదందా చేస్తున్నారు ఎపిటోం నిర్వాహకులు.
ఎపిటోం ఏం చేసిందంటే?
2019 డిసెంబర్ 12న ఎపిటోం ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ ఇన్ కార్పొరేట్ చేశారు. ఎలాంటి షేర్ క్యాపిటల్, పెయిడ్ క్యాపిటల్ చూపించలేదు. మంతెన సతీష్ వర్మ, మంతెన వెంకటరమణ, పద్మిణి కుమారి, కంతా జైపాల్ యాదవ్, లింగాల వినిత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. వీరు మొదటి దశగా.. మాజీ ముఖ్యమంత్రి బినామీలు అయిన పాంటి చడ్డా, మాంతి చడ్డా, రాజేందర్ చడ్డాల నుంచి ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున మొదటి దశగా 351 ఎకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. మిగితా ల్యాండ్స్ లోకి ఎవరిని వెళ్లనియ్యకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ భూమిని అమ్మకం జరిపి మిగితా ల్యాండ్స్ ని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ పలు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అధికారులతో చెట్టాపట్టాల్!
ఈ దందాలో బడా రాజకీయ నేతల పేర్లు వాడుకుంటున్నట్లు తేలింది. అమిత్ షా, కేటీఆర్ తమ జేబులో ఉన్నారని చెప్పకుంటూ అధికారులను జోబుచ్చుతున్నారు. ఇందులో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా.. దానిని కాపాడే దిశగా అడుగులు వేయడం లేదు. భూదాన్ భూమి, సీలింగ్ సర్ ప్లేస్ ల్యాండ్ లో రియల్ ఎస్టేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. రైతులు తమ భూమి ఉందని అడిగితే.. సీఆర్పీసీ 145 అంటూ సెక్షన్ అమలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సీఎం జగన్ కే ఝలక్!
Advertisements
వినిత్ లింగాల.. ఈయన ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలనే బురిడీ కొట్టించాడు. అమిత్ షా కుమారుడు తన ప్రాణ స్నేహితుడంటూ నమ్మించి వారితో వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చాడు. జగన్ ని అమిత్ షాకు కలిపింది తానేనంటూ ఇక్కడ అందరికీ ఉదరగొడుతుంటాడు. అయితే.. అమిత్ షా కుటుంబ సభ్యుల పెళ్లి విషయంలో విజయసాయిరెడ్డి వినిత్ విషయం చెప్పగా.. అప్పటినుంచి అతడ్ని దూరం పెట్టారు. అయితే.. హైదరాబాద్ లో బడాబాబులకు ఇలాగే మాయమాటలు చెప్పి.. మోసాలకు పాల్పడతాడని ఆరోపణలు ఉన్నాయి. విషయం వెలుగులోకి వచ్చాక పోలీసులు హడావుడి చేయడం లాంటివి చేయకుండా.. ముందే ఇలాంటివి పసిగట్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు.