ఓ కాలనీ వాసులతో పాటు.. గ్రేటర్ అధికారులను రివాల్వర్ తో బెదిరించాడు ఓ రియల్టర్. కాలనీ లోని రోడ్డును తవ్వద్దు అని చెప్పినందుకు తమను తుపాకీతో బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సీతారామపురం కాలనీలో చోటుచేసుకుంది.
పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సీతారామయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన తనికు వ్యక్తిగత భద్రతా సహాయకునికుగా హర్యాణాకు చెందిన యోగేష్ కుమార్ ను నియమించుకున్నారు. అయితే.. వారు కాలనీలోని ఓ రోడ్డును తవ్వుతున్నారు. దానిని తవ్వొద్దని కొందరు కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రికుడైన యోగేష్ కుమార్.. వారిని రివాల్వర్ తో బెదించాడు.
దీంతో గ్రేటర్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు. ఘటనా స్థలానికి చేరుకున్న సంబంధిత సిబ్బంది.. రోడ్డు తవ్వకాన్ని నిలపాలంటూ వారిద్దరికీ సూచించారు. ఈ క్రమంలో వారిపై కూడా యోగేష్ కుమార్ రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సిబ్బంది పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రేటర్ సిబ్బంది విధులకు ఆటంకం కల్గించడంతో పాటు.. రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడడం, కాలనీలో రోడ్డు తవ్వినందుకు గాను సీతారామయ్య, యోగేష్ కుమార్ ను బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. వారి వద్ద ఉన్న రివాల్వర్ తో పాటు.. 14 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెల్లడించారు.