ఎప్పుడూ లేని విధంగా మీడియాతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు చిరంజీవి. ముందుగా ప్రింట్ మీడియా, ఆ తర్వాత వెబ్ మీడియా, ఆ తర్వాత మీడియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులతో.. ఇలా వరుసపెట్టి సమావేశం అవుతున్నారు. పైకి ఇదంతా గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా “మీడియా ఇంటరాక్షన్” అనుకోవచ్చు. కానీ అసలు కారణం వేరే ఉందంటున్నారు మీడియా జనాలు.
కొన్ని రోజుల కిందటి సంగతి. గాడ్ ఫాదర్ స్పెషల్ స్క్రీనింగ్. ఓ మీడియాకు చెందిన వ్యక్తిని చిరంజీవి ఆహ్వానించారు. అక్కడితో ఆగలేదు. సదరు మీడియా పర్సన్ కుటుంబంతో కలిసి భోజనం కూడా చేశారు. అలా ఓ మీడియా వ్యక్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మరికొందరికి నచ్చలేదు. దీంతో ఫిలిం సర్కిల్ లో ఉన్న సంఘాలు కలిశాయి.
ముందుగా ఓ సంఘం వెళ్లి చిరంజీవిని కలిసింది. మరిన్ని సంఘాలు ఈ దిశగా ఆలోచనలు చేశాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మొదట చిరంజీవికి అర్థం కాలేదు. ఆ తర్వాత ‘బాగా కావాల్సిన వ్యక్తులు’ కొంతమంది అసలు విషయాన్ని చిరు చెవిన వేశారు.
ఇలాంటి విషయాల్ని ఎలా హ్యాండిల్ చేయాలో చిరంజీవి, తన అనుభవంతో బాగానే తెలుసుకున్నారు. అందుకే మీడియా భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. గుర్రుగా ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధుల్ని ఇలా సమావేశాల పేరిట ఆహ్వానించి, వాళ్లకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. కాస్త అదనపు సమయం వాళ్లతో గడిపారు.
అలా తనపై రేగిన అసంతృప్త జ్వాలల్ని చాకచక్యంగా చల్లార్చారు చిరంజీవి. ఇలా చేయడం చిరంజీవికి వ్యక్తిగతంగా, వృత్తిగతంగా, కుటుంబ పరంగా చాలా అవసరం. ఎందుకంటే, మీడియా ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో సామాన్య జనం ఊహించలేరు. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఊహించగలరు. అందుకే ఇలా గాడ్ ఫాదర్ పేరిట వెబ్, ప్రింట్, ఎలక్ట్రానిక్ అనే తేడా లేకుండా.. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా అందర్నీ ఆహ్వానించారు. అందరితో సాదరంగా మాట్లాడారు. అడిగినవాళ్లకు కాదనకుండా సెల్ఫీలిచ్చారు. తను అందరివాడ్నే కాదు, ప్రత్యేకంగా మీడియా జనాల వాడ్ని కూడా అనిపించుకున్నారు. అదీ సంగతి.