గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికపై అధిష్టానం వ్యూహం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతను డైరెక్ట్ గా సీఎం చేయడం అందరికీ షాకిచ్చింది. బీజేపీ పెద్దల మదిలో ఏముందో అర్థం కావడం లేదు ఆ పార్టీ నేతలకు. ఈ క్రమంలో ఎవరీ భూపేంద్ర పటేల్ అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు విజయం సాధించారు భూపేంద్ర. మాజీ సీఎం ఆనందిబెన్ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఇంతకు ముందు వరకు ఈ నియోజకవర్గానికి ఆనందిబెన్ ప్రాతినిధ్యం వహించేవారు. ఆమెను కేంద్రం గవర్నర్ ను చేయడంతో.. భూపేంద్ర మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
భూపేంద్ర పటేల్ ది సౌరాష్ట్రలో అధిక ప్రాబల్యమున్న పాటిదార్ కమ్యూనిటీ. గుజరాత్ లో విజయానికి పాటిదార్ కమ్యూనిటీ ఎంతో కీలకం. రాష్ట్ర ఎకానమీపై పట్టున్న కో ఆపరేటివ్ సెక్టార్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, కన్ స్ట్రక్షన్ లలో వీరిదే హవా. భూపేంద్ర కూడా ఇంజినీర్, బిల్డర్. అంతేకాదు వివాద రహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపార వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు పాటిదార్ ఆర్గనైజేషన్స్ అయిన సర్దార్ ధామ్, విశ్వ ఉమియ ఫౌండేషన్ లకు ట్రస్టీగా ఉన్నారు. ఈ అంశాలన్నీ ఆయనకు ఎంతగానో కలిసొచ్చాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా సీఎం కుర్చీకి దగ్గర చేశాయి.
ఎమ్మెల్యే కాకముందు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్ గా పనిచేశారు భూపేంద్ర. 2015 నుంచి 2017 వరకు ఉన్నారు. అలాగే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా 1995-96లో కొనసాగారు. అనేక వంతెనలు నిర్మించారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో తనవంతు కృషి చేశారు. ఆ పట్టుదలే మోడీకి ఎంతగానో నచ్చింది. తన విజన్ కు తగ్గట్టుగా భూపేంద్ర పని చేస్తారని గట్టిగా నమ్మారు. మోడీతో ఉన్న మంచి సంబంధాలు కూడా భూపేంద్ర సీఎం అయ్యేందుకు ఉపయోగపడ్డాయి.