కరోనా మహమ్మారి మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కరోనా పేరు పలకకుండా ఉండేవారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఈ మహమ్మారి ఈ స్థాయిలో పాపులర్ అవుతూ.. డోలో 650 మాత్రలను కూడా పాపులర్ చేసింది. కరోనా ప్రధాన లక్షణం తేలికపాటి జ్వరం కావడంతో డాక్టర్లు వీటిని వాడమని చెబుతారు. పెద్దగా చదువుకోని వారు కూడా జ్వరం వస్తే.. డోలో 650 వేసుకోవాలనుకునే విధంగా అందరి నోట్లో నానుతుంది.
కరోనా సమయంలో 350 కోట్ల డోలో 650 మాత్రలు ప్రజలు వాడారంటే ఎంతగా పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతగా ప్రజాదరణ పొందడానికి కారణమైన ఈ బ్రాండ్ మాత్రలను బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. డోలో 650 సక్సస్ కి కారణాలను చెబుతూ మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా సోకగానే కనిపించే మొదటి లక్షణం జ్వరం కావడంతో వైద్యులు ముందుగా డోలో 650ని సిఫార్సు చేస్తున్నారని ఆయన తెలిపారు. యాంటీ- బయాటిక్, యాంటీ-హిస్టమిన్ మందులు, విటమిన్ ట్యాబ్లెట్ల కూడా సూచిస్తున్నా.. ప్రధానంగా డోలో650నే సజెస్ట్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఇంత ప్రజాదరణ లభిస్తుందని తాము ఊహించలేదని దిలీప్ సురానా చెప్పారు.
క్వారంటైన్, లాక్‌డౌన్ టైంలో కరోనా ప్రిస్క్రిప్షన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందని.. అప్పటికే ఉన్న కాస్త గుర్తింపు.. దీంతో ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిందని అభిప్రాయ పడ్డారు. వాట్సప్ లో వైరల్ అయిన ఆ ప్రిస్క్రిప్షన్ ప్రతీ ఇంట్లోకి వెళ్లిందని.. ఆ టైంలో డోలో 650 మాత్రలు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తగా పెట్టుకునే వారని ఆయన వివరించారు. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే.. డోలో 650 వేసుకోవాలని వ్యాక్సినేషన్ కేంద్రంలోనే ఆరోగ్య కార్యకర్తలు సూచించేవారని చెప్పారు. ఈ కారణాల వలన క్షేత్ర స్థాయిలో డోలో 650 బాగా పాపులర్ అయిందని దిలీప్ సురానా అన్నారు.
కరోనా సమయంలో ప్రజలకు జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తూ.. పోస్టర్లను మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పారాసిట్మాల్ కి చెందిన చాలా బ్రాండ్ లు ఉన్నా.. డోలో 650కే ఈ ప్రజాదరణ దక్కిందని చెప్పారు.