“నన్ను చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నారు. అవకాశమొస్తే ఎందుకు చేయను. స్వాతిముత్యం లాంటి పాత్రలు మా వరకూ రావట్లేదు. వస్తే తప్పకుండా చేస్తాం. నేను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను.”
సీనియర్ ఆర్టిస్టు సురేఖ వాణి తాజా స్టేట్ మెంట్ ఇది. ఆమెకు ఈమధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు, మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఆమె కనిపించడం లేదు. దీంతో ఆమె సినిమాలు తగ్గించేసిందని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవం అది కాదు. ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకిలా జరుగుతోంది?
నిజానికి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి టైమ్ లో సురేఖ వాణి తనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం, అదే సమయంలో ఆలోచించదగ్గ మేటర్ కూడా.
సురేష్ వాణి మంచి నటి. ఆమె ఇప్పటికీ అదే ఫిజిక్, అదే చలాకీతనం మెయింటైన్ చేస్తోంది. హీరోయిన్లకు లేదా, కొంతమంది యంగ్ హీరోలకు తల్లిగా నటించడానికి ఆమెకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఆమెను ఎందుకు టాలీవుడ్ మేకర్స్ లెక్కలోకి తీసుకోవడం లేదనేది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.
టాలీవుడ్ లో కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. క్యారెక్టర్, క్రమశిక్షణ కూడా ఉండాలంటారు. ఈ విషయంలో సురేఖవాణిపై కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కానీ, కెరీర్ పై ప్రభావం చూపించేంత రిమార్క్స్ ఆమెపై పెద్దగా లేవు. మరి ఎందుకు ఆమెకు ఛాన్సులు తగ్గాయో సురేఖవాణికి, కొంతమంది టాలీవుడ్ ప్రముఖులకే తెలియాలి.