ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి చాలా రోజులుగా ఆ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది కానీ.. అలాంటి పరిస్థితులేం కనిపించలేదు. కానీ సోమవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన త్రివేంద్రసింగ్.. మరుసటి రోజే గవర్నర్ రాణీ మౌర్యను కలిసిరాజీనామా లేఖ అందజేయడం సంచలనం సృష్టిస్తోంది.
త్రివేంద్ర పనితీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తినే ఆయన రాజీనామాకు దారి తీసిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా ధన్‌సింగ్ రావత్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే చాన్స్ కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే సీఎంని మార్చడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తన రాజీనామాపై త్రివేంద్ర మరొకలా స్పందించారు. ముఖ్యమంత్రిగా మరొకరికి ఈ అవకాశాన్ని ఇచ్చే ఉద్దేశ్యంతోనే తమ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్తున్నారు.