తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో గతానికి భిన్నంగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. హడావుడిగా పోగ్రాం ఫిక్స్ కావడం నుంచి .. తిరిగి హైదరాబాద్ వెళ్లేవరకూ అన్నీ కొత్తగా అనిపించాయని అధికారులు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు వచ్చారన్నదానిపై సరైన సమాధానమే తెలియడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద తొలిసారి16 టీఎంసీలు నీరు నిల్వం ఉండటంతో, దాన్ని చూసేందుకే వచ్చారని అధికారులు చెబుతున్నా.. అనధికారికంగా మాత్రం అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఇప్పటి వరకు ఏడుసార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అయితే ఆయన అదృష్ట సంఖ్య ఆరు కావడంతో సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా ఉండేందుకు మరోసారి పర్యటనను ప్లాన్ చేసుకుని ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్‌లో మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు బిగించిన ఆరు మోటార్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వచ్చారేమోనన్న చర్చ కూడా జరుగుతోంది. మూడో టీఎంసీకి సంబంధించిన పనులునిలిపివేయాలని కేంద్రం సూచించడంతో.. నేరుగా కన్నెపల్లి రాకుండా మేడిగడ్డకు వచ్చి ఉంటారని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఆద్యంతం ఎక్కువగా మౌనంగానే కనిపించారని అధికారులు చెప్పుకుంటున్నారు. ఆలయ పండితులతో కూడా పెద్దగా మాట్లాడలేదని.. అలాగే నడుము నొప్పిగా ఉండటంతో తన సతీమణి చేతుల మీదుగానే పంచామృత అభిషేకం జరిపించడం కూడా కొత్తగా అనిపించింది. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చినా.. కేసీఆర్ తన మనసులో దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండి, ఉంటారని అందరూ భావిస్తున్నారు.