హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత లేటుగా వస్తే అంత మంచిదని కేసీఆర్ అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక పెడితే టీఆర్ఎస్ కు డిపాజిట్ రావడం కూడా కష్టమని సర్వేలు చెబుతున్నాయని తెలుస్తోంది. కేసీఆర్ చేయించిన సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలవడం కష్టమని తేల్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య 20% దాకా ఓట్ల తేడా ఉందని సర్వే రిపోర్ట్స్ తేల్చాయని టీఆర్ఎస్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు, హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అని కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ ను అడిగినప్పుడు సర్వే రిపోర్ట్ లు, ఇంటెలిజెన్స్ నివేదికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కరోనా ప్రభావం ఉంది.. ఇప్పుడే ఎన్నిక వద్దు అని కేంద్ర ఎన్నిక సంఘానికి లేఖ రాసారు కేసీఆర్. ఇక రెండోసారి అడిగినప్పుడు కరోనా ప్రభావం అని చెప్పకుండా తెలివిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి సెప్టెంబర్ చివరి నాటికి వాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ఆతరువాత పండగల సీజన్ ఉంది కాబట్టి నవంబర్లో నిర్వహిస్తే మంచిది అని అర్ధం వచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. దీనినిబట్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే కేసీఆర్ భయపడుతున్నట్టు అర్థం అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈటలను ఈజీ గా ఓడించవచ్చు అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయని అంటున్నారు. బహుశా కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడు చూసి ఉండరు అని కూడా విశ్లేషిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం కేసీఆర్ పడుతున్న పాట్లు చూస్తుంటే అర్థం అవుతుందని చెబుతున్నారు. ఉప ఎన్నిక ఎంత లేటయితే అంత మంచిదని కేసీఆర్ భావిస్తుంటే… ఎప్పుడు ఎన్నిక జరిగినా తనదే విజయం అనే ధీమాలో ఈటెల ఉన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని దానిని ఎవరు మార్చలేరని అంటున్నారు. కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే భయపడుతున్నారని సాధారణ ప్రజలకు కూడా తెలిసిపోయిందని ఈటెల కామెంట్ చేస్తున్నారు.
ఒక వైపు విద్యార్థులకు బడులు తెరుస్తూ..మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉంది ఇప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నిక వద్దు అని కేసీఆర్ అంటున్నారంటే ఎంత భయపడుతున్నారో తెలుస్తూనే ఉందని అంటున్నారు. ప్రజలకు అంత అర్ధం అవుతుందని, కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్నికను నవంబర్ కు వాయిదా వేయించినా, హుజురాబాద్ లో తన గెలుపును ఆపలేరని అంటున్నారు. తనను ఓడించడానికి కేసీఆర్ ఎంతటి నీచ రాజకీయాలకైనా ఒడిగడతాడని ఈటల మండిపడుతున్నారు. డబ్బు, కుట్రలు, కుతంత్రాలను నమ్ముకున్న కేసీఆర్ వాటితో తాను ఏదైనా చేయగలను అని అనుకుంటున్నారని ఈటల ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.
“నేను ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పి ఎన్నిక ను వాయిదా వేయించి వస్తాను.. నువ్వు హుజూరాబాద్ వదిలి ఢిల్లీ రావద్దు” అని హరీష్ కు చెప్పారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఎన్నిక వాయిదా పడ్డదని ఇంఛార్జిలు హుజురాబాద్ వదిలి వెళతారేమో, ఎవరు వెళ్లొద్దని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈటలను ఈజీగా వదిలించుకోవచ్చు అని పెద్ద సార్ అనుకున్నారు కానీ హుజూరాబాద్లో పరిస్థితి ఆలా లేదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఈటల తమ పెద్ద సార్ కు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ప్రజలలో ఆయనకు చాల అభిమానం ఉందని ఈటలపై ఉన్న సానుభూతిని తగ్గించలేకపోతున్నామని అంటున్నారు. కేసీఆర్ ఎన్ని చేసినా, ఉప ఎన్నికను మూడు నెలలు వాయిదా వేయించినా హుజురాబాద్ లో ఈటల గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు