గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ సై అంటే సై అని సవాళ్లు విసురుకుంటోంటే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో జోష్ లేకపోవడం ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు. మిగతా అన్ని పార్టీల్లో జిల్లాల కేడర్ కూడా హైదరాబాద్‌లో తిష్టవేసి కూర్చొంటే.. కాంగ్రెస్‌లో కనీసం నగరానికి చెందిన లీడర్లు అయినా యాక్టీవ్‌గా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్‌లో పెద్దలుగా చెప్పుకునే చాలా మంది నేతలు ఈ ఎన్నికల్లో మొహం చూపెట్టకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తారని పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగడం కొందరిని అసంతృప్తికి గురి చేస్తోందని తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత కచ్చితంగా పీసీసీ పదవి తమకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారు.. తాము ప్రచారానికి రాకపోగా, తమ మాట వినే మిగిలిన వారికి కూడా క్యాంపెయిన్‌లో పాల్గొనకుండా కంట్రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఈ ఎన్నికల్లో కావాలనే సహాయ నిరాకరణకు దిగారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోతే.. దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటి నుంచే ఆయా నేతలు వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము గ్రేటర్ బాధ్యతలని తీసుకొని ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని…తాము లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే ఇలా చేశామని చెప్పుకునేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారట. అందుకే ఈ ఎన్నికల్లో సోకాల్డ్ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదని న్యూట్రల్ లీడర్స్ గుసగుసలాడుకుంటున్నారు.