దేశంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. నిత్యం 10 వేలకు అటు, ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ 200 లోపే బయటపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గి, త్వరలోనే కరోనా రహిత దేశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో రోజువారి కేసులు లక్ష మార్క్‌కు చేరువై.. తక్కువ సమయంలోనే అవి పదివేలకు పడిపోవడం ఎంతో ఊరటనిచ్చే విషయమే. ఇతర దేశాల్లో కరోనా మహమ్మారి ఇంకా పంజా విసురుతోంటే.. ఇండియాలో మాత్రం దిగిరావడానికి ముఖ్యం కారణం అవగాహనే అంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్ కంటే ప్రభావవంతంగా పనిచేస్తున్న మందు అదేననని చెబుతున్నారు.
కరోనా వైరస్ విజృంభణ తర్వాత మాస్క్‌లు, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం వంటి అలవాట్లు పెరిగాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లే సమయంలో.. కచ్చితంగా కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ఫలితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కరోనా వైరస్ రవాణాకు మొదట్లోనే బ్రేక్ పడుతోంది. ఇక కరోనా మరణాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి. ఒకానొక సమయంలో రోజు వెయ్యికి పైగా నమోదైన మరణాలు.. ఇప్పుడు వంద, రెండు వందల మధ్యే పరిమితమవుతున్నాయి. ఈ మహమ్మారి ఇంతలా కంట్రోల్ కావడానికి కచ్చితంగా ముఖ్య కారణం అవగాహనే అని చెబుతున్నారు.