చంద్రయాన్-2 ప్రయోగానికి చివరి నిమిషంలో ఎదురుదెబ్బ తగలటానికి కారణాలు ఇస్రో కనుగొంది. విక్రమ్ ల్యాండింగ్ కు వైఫల్యానికి కారణాలను కనుగొన్న ఇస్రో స్పేస్ కమిషన్ కు రహస్య నివేదిక అందజేసినట్టు తెలిసింది. ల్యాండింగ్ కోసం వినియోగించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగానే ఈ ఎదురుదెబ్బ తగిలిందని ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. నిజానికి ముందుగా ఊహించినట్టుగానే విక్రమ్ చంద్రుడిపై దిగటం ప్రారంభించింది. 30 కిమీల ఎత్తు నుంచి 5 కీమీల వరకూ సాఫీగానే చంద్రుడి వైపు ప్రయాణించింది. రఫ్ ల్యాండింగా పిలిచే ఈ దశలో ఎటువంటి లోపం తలెత్తలేదు. అయితే తదుపరి ఫైన్ బ్రేకింగ్ స్టేజ్‌లోనే అనుకోని పరిస్థితి తలెత్తింది. చంద్రుడి ఉపరితలానికి దాదాపు 500మీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ కంట్రోల్ కోల్పోయింది. ఆ సమయంలో విక్రమ్ కు అమర్చిన ఇంజన్లలో కేవలం ఒకటి మాత్రమే పనిచేసింది. మరోవైపు వేగం సెకనుకు 146మీటర్లుకు చేరుకుంది. ఈ క్రమంలో అదుపుతప్పిన ల్యాండర్ నిర్దేశిత ప్రాంతానికి 750 మీటర్ల దూరంలో పడిపోయింది. చంద్రుడి ఉపరితలాన్ని వేగంగా ఢీకొనటంతో ల్యాండర్‌లోని యంత్రాలు దెబ్బతిని భూమి మీద ఉన్న కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్‌ల్యాండింగ్‌కు ఉపకరించే సాఫ్ట్‌వేర్‌లో అనుకోని ఇబ్బంది తలెత్తడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని వి.నారయణన్ సారథ్యంలోని ఇస్రో అంతర్గత కమిటీ తేల్చింది.
అయితే సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించిన సమయంలో ఎటువంటి లోపం కనిపించకపోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దర్యాప్తులో అమెరికా అంతరీక్ష సంస్థ నాసా అందించిన సమాచారాన్ని కూడా ఈ కమిటీ విశ్లేషించింది. పూర్తి నివేదికను స్పేస్ కమిషన్‌కు అందజేసింది.