లాక్ డౌన్ విధించటంతో ఇబ్బంది పడ్డ మందుబాబులు లాక్ తీయగానే వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. కి.మీ మేర లైన్ ఉన్నా సరే బాటిల్ తోనే ఇంటికెళ్లాలన్న ఆలోచనతో మండుటెండను సైతం లెక్క చేయలేదు. మొదటి రెండు రోజుల తర్వాత వైన్ షాపుల ముందు బారులు తీరిన లైన్లు తగ్గినప్పటికీ మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గలేనట్లు కనపడుతోంది.
తొలిరోజే 100కోట్ల పైచిలుకు అమ్మకాలతో రికార్డు సృష్టించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ… అదే జోరును కంటిన్యూ చేసింది. వైన్ షాపులు ఓపెన్ అయి నాలుగు రోజులు గడిచిపోయాయి. ఈ నాలుగు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి 600కోట్ల పైచిలుకు రికార్డు ఆదాయం వచ్చిందని సమాచారం. శనివారం ఒక్క రోజే 149కోట్ల రూపాయల మద్యం డిపోల నుండి వైన్ షాప్ లకు తరలివెళ్లింది. ఆదివారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో వైన్ షాపులు ఎక్కువగా ఆర్డర్ పెట్టినట్లు కనపడుతోంది.
మే 6న 72.5కోట్లు, మే 7న 188.2కోట్లు, మే 8న 190.47కోట్లు అమ్మకాలు జరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏపీ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండటం కూడా ఎక్కువగా అమ్మకాలకు కారణమయ్యాయని అధికారులు భావిస్తున్నారు.