హైదరాబాద్: నగరానికి జ్వరమొచ్చింది. పల్లెకు సుస్తీ చేసింది. విష జ్వరాలతో తెలంగాణ వణికిపోతోంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి వైద్యం కోసం బారులు తీరి నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులు గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో రోజుకు మూడు వేలకు పైగా ఔట్ పేషంట్లు వైద్యం చేయించుకుంటున్నారు.
నెల రోజుల వ్యవధిలో రెండు లక్షలకు పైగా ఔట్ పేషంట్లు వైద్యం చేయించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 20వేలకు పైగా ఇన్‌పేషంట్లుగా ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.
అసలే జ్వరాలతో ఓపిన లేని పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే అక్కడ గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫీవర్ ఆస్పత్రిలో పరిస్థితిని మంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇబ్బందికాకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు.
వాతావరణంలో మార్పుల వల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమలు, అపరిశుభ్ర నీరు, వాతావరణం వల్లే విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవి సోకకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు