ఏదైనా పండుగ ఉత్సవాలంటే భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఉంటుంది. చిన్నా, పెద్దా ఒకచోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఇక జాతరలు, తిరునాళ్ల సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఐటమ్ సాంగ్స్, అశ్లీల నృత్యాలతో జాతర వైభవాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో రెచ్చిపోయారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సూరవరపు వారి వీధిలో అమ్మవారి జాతర నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఐటమ్ సాంగ్స్ కు అశ్లీల నృత్యాలు చేయించారు నిర్వాహకులు. ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాలే స్టేజ్ ని ఏర్పాటు చేసి ఈ నృత్యాలను నిర్వహించడంపై భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
డ్యాన్స్ చేసిన స్టేజ్ కు దగ్గరలోనే పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు ఉంది. అయినా కూడా ఎవరూ అడ్డుకోలేదు. జాతరలో డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సైతం సైలెంట్ అయిపోయాడు. ప్రలోభాలకు లోబడి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారని పోలీసులపై మండిపడుతున్నారు భక్తులు.
అమ్మవారి జాతరలో మాస్ మసాలా పాటలకు డ్యాన్సులు చేయడం ఏంటని.. నిర్వాహకులకు బుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.