రానుంది భయంకర కాలం.. మాంద్యంతో సతమతం కానుంది ప్రపంచం అని హెచ్చరిస్తోంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్. వచ్చే ఏడాది నాటి ఎకానమీ బూచిని అప్పుడే అంచనా వేస్తోంది. ప్రపంచ దేశాల మాట దేవుడెరుగు.. మొదట ఇండియాపై ఈ సంస్థ దృష్టి సారించింది. 2023 లో భారత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ 6.8 శాతానికి దిగజారుతుందని పేర్కొంది. ఇదివరకు ఇది 7.4 శాతం ఉండగా.. తాజాగా దీన్ని ఈ మేరకు తగ్గించింది. ఎలా లేదన్నా 60 బేసిస్ పాయింట్లు తగ్గుతాయట.
యాన్యువల్ ఫండ్ బ్యాంక్ మీటింగ్ సందర్భంగా ‘వాల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్’ నివేదికను ఈ సంస్థ రిలీజ్ చేసింది. 2022 సంవత్సరానికి గ్లోబల్ వృద్ధి రేటు 3.2 శాతమని, కానీ వచ్చే సంవత్సరానికి ఇది 2.7 శాతమవుతుందని ఈ రిపోర్టు వెల్లడించింది. చాలావరకు ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రభావమే ఇదని ఐఎంఎఫ్ ఎకనమిక్ కౌన్సిలర్, రీసెర్చ్ డైరెక్టర్ పియెర్రీ ఆలివర్ గొరించాస్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అమెరికా, చైనా, యూరప్ దేశాలలోని తాజా పరిణామాలు మనల్ని భయపెడుతూనే ఉంటాయని ఆయన అంటున్నారు.
లోగడ కాస్త మానిందనుకున్న ఎకానమీ ‘గాయాలు’ మళ్ళీ రేగనున్నాయని హెచ్చరించారు. ఒకవిధంగా చెప్పాలంటే 2023 సంవత్సరాన్ని ‘మాంద్యంతో సతమతమయ్యే’ సంవత్సరంగా అభివర్ణించవచ్చునన్నారు.
ఇండియా విషయానికే వస్తే.. ఈ దేశ జీడీపీలో 84 శాతానికి రుణ భారం చేరుకుందని, అంతర్జాతీయంగా భారత రుణభార పరిమితి డేంజర్ లెవెల్స్ కి చేరిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ ఏజెన్సీ.. స్టాండర్డ్ అండ్ పూర్స్ .. అంచనా ప్రకారం.. భారత ఎక్స్ టర్నల్ బ్యాలన్స్ షీట్ మెరుగైన స్థితినే సూచిస్తున్నప్పటికీ తన సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడి అధికంగానే ఉన్న ఫలితంగా వచ్చే ఏడాది నాటికి దిగజారే తన మార్కెట్ విలువల నుంచి తప్పించుకోజాలదట.
భారత అంతర్జాతీయ ద్రవ్యనిధులు తగ్గుతున్నాయని, డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతోందని, ప్రస్తుత ద్రవ్యలోటు పెరుగుతోందని ఏండ్రు వుడ్ అనే ఎనలిస్టు అంటున్నారు. ఆగస్టులో దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ 18 నెలల కనిష్ట స్థాయికి చేరింది. మైనస్ 0.8 శాతానికి పరిమితమయింది. అని ఆయన పేర్కొన్నాడు. 2021 లో ఇండియాకు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధులు 634 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం ఇది 533 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయాన్నీ ఆయన గుర్తు చేశాడు.