– చెంచులక్ష్మికి అండగా రెడ్ క్రాస్
– నిత్యావసరాలతోపాటు నగదు సాయం
– వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన సభ్యులు
– గ్రామంలో అన్నదాన కార్యక్రమం
– తొలివెలుగుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
“బాత్రూంలో నివాసం” అంటూ ఓ అభాగ్యురాలి ధీనస్థితిపై తొలివెలుగు ఇచ్చిన కథనానికి రెడ్ క్రాస్ స్పందించింది. గౌరవ గవర్నర్ తమిళిసై కార్యాలయ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆదేశాలతో మహబూబ్ నగర్ కు చెందిన సభ్యులు ఆమె ఉంటున్న మహ్మదాబాద్ మండలం చిన్నాయిపల్లి గ్రామానికి వెళ్లారు.
మహబూబ్‌నగర్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు చెంచు లక్ష్మిని కలిసి మాట్లాడారు. తొలివెలుగులో వచ్చిన కథనం చూసి వచ్చామని.. ఆమెకు చెప్పి గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఆమెకు ఆర్థిక సాయం అందించారు.
చెంచులక్ష్మికి క్వింటాల్ బియ్యంతోపాటు నూనె, పప్పు సహా నిత్యావసరాలు అందించారు రెడ్ క్రాస్ సభ్యులు. అలాగే స్టీల్ పాత్రలు, చీరలు, దుప్పట్లు, హైజెనిక్ కిట్లు, పండ్లు, బిస్కెట్లతోపాటు రూ.20వేల నగదు అందజేశారు. అంతేకాకుండా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు తీసుకున్నారు. ఐఆర్‌సీఎస్ వైస్ ఛైర్మన్ డాక్టర్ శామ్యూల్ పరిశీలించి చెంచులక్ష్మికి టైఫాయిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. ఆదివారం టిబి నిర్ధారణకు పరీక్షలు నిర్వహిస్తామని నటరాజు తెలిపారు.
గ్రామంలో 60 చెంచుల ఇళ్లు ఉన్నట్లు రెడ్‌క్రాస్ సొసైటీ గుర్తించింది. అందుకే తాము ఈ గ్రామంలో వైద్య, ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నామని వివరించింది. ఇక చెంచులక్ష్మి పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన తొలివెలుగుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సభ్యులు. ఈ కార్యక్రమంలో నటరాజు, కమిటీ సభ్యులు జనార్ధన్, బాబుల్ రెడ్డి, లోకల్ లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.