కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా కోవోవాక్స్ ధరను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం భారీగా తగ్గించింది. 12 నుండి 17 సంవత్సరాల పిల్లలకు టీకా వేయనుండగా.. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్టల్‌లో చేర్చిన మరుసటి రోజే సీరమ్ ధరను సవరించింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ డోస్ ధర రూ.900 ఉండగా.. రూ.225కి తగ్గించింది.
దీనికి జీఎస్టీ అదనంగా జోడించనుండగా.. ఈ విషయాన్ని సీరం కంపెనీ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు.ప్రైవేటు ఆసుపత్రిలో సర్వీస్ చార్జీగా రూ.150 వరకు వసూలు చేయొచ్చునని వివరించారు.
టీకాకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గతేడాది 28న పెద్దల కోసం.. 12-17 సంవత్సరాల మధ్య పిల్లలకు మార్చి 7న అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. 12 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ టీకాలు వేస్తుండగా.. 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రభుత్వ ఇమ్యునైజేషన్ కేంద్రాల్లో ఉచితంగా భారత్ బయోటెక్ కోవాక్సిన్ పంపిణీ ఇస్తున్నారు.
ప్రైవేట్ సెంటర్లలో కోవోక్సిన్ డోస్ ధర జీఎస్‌టీతో కలిపి రూ.386 కాగా.. కార్బెవాక్స్ ధర రూ.990గా ఉన్నది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నివేదిక ప్రకారం.. వివిధ రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 19,01,68,140 డోస్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు అధికారులు.