రాజకీయాల్లో కొడుకులతో వచ్చే ‘సన్’ స్ట్రోక్సే కాదు… కూతుళ్లతో వచ్చే ఇబ్బందులనూ చూశాం. కానీ కూతుళ్లతో కాస్త అరుదుగా ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. అయితే, టీఆర్ఎస్‌లో సీనీయర్ నేతకు ఇప్పుడు కూతురి కారణంగా మంత్రి పదవి పోయిందట. ఇంట్లో ఎన్ని పదువులుంటే ఏం లాభం… చక్రం తిప్పగలిగే అసలు పదవి లేనిది అంటూ ఆయన క్యాడర్ కూడా మొహాం తిప్పేస్తుండటంతో సదరు నేత అగ్గిమీద గుగ్గిలంలా… కోపోద్రిక్తులు అవుతున్నారని తెలుస్తోంది.
రెడ్యానాయక్. మాజీ మంత్రి… ప్రస్తుతం డోర్నకల్ నుండి ఎమ్మెల్యే కూడా. కాంగ్రెస్‌లో సీనీయర్ లీడర్లలో ఒకరు. గిరిజన నాయకుడు కావటంతో… తనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుండేది. అయితే, మంత్రి పదవి కోసం ఆయన చివరి వరకు ప్రయత్నించారు. కానీ కూతురు కారణంగా తాను మంత్రి పదవి కోల్పోవటం రెడ్యానాయక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పైగా తనకు రాని మంత్రి పదవి తనకు ఏమాత్రం పొసగని సత్యవతి రాథోడ్‌కు రావటం రెడ్యానాయక్ వర్గానికి మింగుడు పడటం లేదు.
అయితే, మంత్రి పదవి విషయంలో రెడ్యానాయక్‌కు టీఆర్ఎస్ ముందే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో రెడ్యానాయక్, తన కూతురు కవితకు కూడా టికెట్ అడిగారు. కానీ అధిష్టానం ఇవ్వలేదు. కానీ ఎంపీ ఎన్నికల సమయంలో రెడ్యానాయక్ తన కూతురు టికెట్ కోసం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలోనే ఒకే ఇంట్లో ఎంపీ, ఎమ్మెల్యే ఉండగా… మంత్రిపదవి అడగరాదు అని కండిషన్ పెట్టినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కానీ కవిత టికెట్ తీసుకోవటం, గెలవటం జరిగిపోయాయి. అయినా… గిరిజన నాయకుడిగా మంత్రిపదవి ఇవ్వాలని రెడ్యానాయక్ కోరినా, మహిళ కోటాలో సత్యవతి రాథోడ్ వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. దాంతో రెడ్యానాయక్‌కు కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. తనంటే గిట్టని రెడ్యానాయక్… ఇప్పుడు ఏ పనికోసం అయినా సత్యవతి రాథోడ్‌ను కలవాల్సి వస్తుంది. తనను అడిగి పని చేయించుకోవాల్సి వస్తోంది. ఇది రెడ్యానాయక్‌కు ఇబ్బందిగా మారిందని ఆయన క్యాడర్ బోరుమంటున్నారని సమాచారం. పైగా తన నియోజకవర్గం నుండి నేతలు నేరుగా సత్యవతి రాథోడ్‌ను కలవటం, ఆమె వారికి అడిగిన పనల్లా చేసిపెడుతుండటంతో… తన క్యాడర్ కూడా చెదిరిపోతుందన్న బాధతో… కూతురు కవితను చీవాట్లు పెట్టారని డోర్నకల్‌లో చర్చ జోరుగా సాగుతోంది.
వద్దంటే వినకుండా నాతో ఒత్తిడి చేయించి ఎంపీ టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు నీ వల్ల మన పరిస్థితి చూడు… ఎటూ కాకుండా పోయాం అంటూ ఇబ్బందిపడ్డ ప్రతిసారి ఎంపీ కవితను రెడ్యానాయక్ తిట్టిపోస్తున్నాడంటూ డోర్నకల్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.