వనదేవతలు సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన చినజీయర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో గిరిజన సంఘాల నేతలు, ఇతర నాయకులు ఆయనపై భగ్గుమంటున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వామీజీ ముసుగులో ఎలాబడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కాంతారావు. ఆదివాసీ ఆరాధ్య దైవాలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో పలు పోస్టులు పెట్టారు ఎమ్మెల్యే.
“రూపం లేకపోయినా ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మను కోట్లాది మంది కొలుస్తున్నారు. మీలా మోసం చేయడం మా జాతికి తెలియదు” అని చినజీయర్ ను ఉద్దేశించి పోస్టులు పెట్టారు కాంతారావు. అంతేకాదు ఆదివాసీ గూడాల్లో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఓయూలో చినజీయర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు గిరిజన విద్యార్థులు. సమ్మక్క సారలమ్మను అవమానించడం.. గిరిజన జాతి మొత్తాన్ని అవమానించడమేనన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం మద్దతు తెలిపితే.. గిరిజనులు ఎవరూ టీఆర్‌ఎస్ ను పట్టించుకోరని హెచ్చరించారు. చినజీయర్ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు గిరిజన విద్యార్థులు.