ఏళ్లు గడిచినా కొన్ని సినిమాలకు మోక్షం దక్కదు. అవి ఎందుకు అలా ఆగిపోతున్నాయనేది ఆ సినిమా యూనిట్ కు మాత్రమే తెలుసు. రీసెంట్ గా వచ్చిన సువర్ణ సుందరి కూడా ఆ కోవకు చెందిన సినిమానే. చాన్నాళ్ల విరామం తర్వాత ఆ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా రాబోతోంది. దాని పేరు నేనే నా.
రెజీనా లీడ్ రోల్ పోషించిన సినిమా నేనే నా. ఆపిల్ ట్రీ స్టుడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ నిర్మించిన సినిమా ఇది. ఈ మూవీ షూటింగ్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కాపీ రెడీ అయి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినప్పటికీ సరైన మార్కెట్ లేక ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడీ సినిమాకు మోక్షం దక్కింది.
ఎస్పీ సినిమాస్ సంస్థ, నేనేనా మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుంది.
‘నేనే నా’ 1920, ప్రస్తుతం కాలం అనే రెండు నేపథ్యాల్లో సాగుతుంది. ఇదొక ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్. రెజీనా ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషించింది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే మిషన్ సమయంలో ఊహించని ఘటనలు ఎదుర్కొంటుంది. వాటి నుంచి రెజీనా ఎలా బయటపడిందనేది ఈ సినిమా స్టోరీ.