కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నిర్మించేందుకు సూచన ప్రాయంగా అంగీకారం తెలిపింది. 340 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలను ఈ రోడ్డు హైదరాబాద్‌తో కలుపుతుంది. ఈ రోడ్డును నిర్మించేందుకు మొత్తం రూ.16వేల కోట్ల వ్యయం కానుంది. ఈ రోడ్డు నిర్మాణం అయితే దేశంలోనే అత్యంత పొడవైన బైపాస్‌గా మారుతుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలిసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోడ్డు నిర్మాణానికి కావల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించే ప్రక్రియ పూర్తి చేస్తే మూడేళ్లలో ఈ రోడ్డును నిర్మిస్తామని మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు ఈ ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
2016 నవంబర్ నెలలో రీజినల్ రింగ్ రోడ్డును రెండు భాగాలుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే ఈ రోడ్డును దక్షిణ, ఉత్తర భాగాలుగా విభజించి నిర్మించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తీసుకున్న నిర్ణయం రోడ్డు నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేసింది.
రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల మేర పూర్తి చేస్తారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్‌ల మీదుగా ఈ రోడ్డు కొనసాగుతుంది. ఈ రోడ్డుకు రూ.7,560 కోట్ల వ్యయం అవుతుంది. ఆ మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. అలాగే భూ సేకరణకు అయ్యే రూ.1961 కోట్లను కూడా కేంద్రమే భరిస్తుంది. ఇక ఆ మొత్తం వ్యయంలో రాష్ట్రం 50 శాతం వాటాను భరిస్తుంది.
దక్షిణ భాగంలో 182 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు మంత్రి గడ్కరీ నుంచి ఆమోదం లభించిందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డిల మీదుగా రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఇందుకు రూ.4322 కోట్లు ఖర్చవుతుందని, భూసేకరణకు మరో రూ.1748 కోట్లు అవుతాయని తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే ముంబై, పూణె, నాగ్‌పూర్, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయవచ్చు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ లలో ట్రాఫిక్ రద్దీతోపాటు కాలుష్యమూ తగ్గుతుంది.