హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ తరహా పరిస్థితులు తమ రాష్ట్రంలో నెలకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తమ రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు.
విపత్తు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ రాష్ట్రానికి విపత్తు నిధులను పెంచాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హిల్ స్టేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కోతకు గురికావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాప్లర్ వెదర్ రాడార్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ డాప్లర్ వెదర్ రాడార్ ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారంపై మెరుగైన వాతావరణ సేవలను, వాతావరణ హెచ్చరికలను, డేటాను అందిస్తుంది. తమ రాష్ట్రానికి నాలుగు డెడికేటెడ్ డాప్లర్ వెదర్ రాడార్ వ్యవస్ధలు అవసరమని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో భూమి కోతకు గురయ్యే ప్రమాదం నెలకొందన్నారు. దీంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. కిన్నౌర్, లహౌల్, స్పిటి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్స్ వాటిల్లాయన్నారు. ఆయా ప్రాంతాల్లో భూములకు పగుళ్లు కనిపించాయని సీఎం తెలిపారు.