– డబుల్ రిజిస్ట్రేషన్ తో ఘరానా మోసం
– హయత్ నగర్ లో వెలుగుచూసిన బాగోతం
– అక్రమార్కులకు సహకరించిన వరంగల్ సబ్ రిజిస్ట్రార్!
– ఉన్నతాధికారులను చెప్పినా పట్టించుకోని వైనం
– న్యాయం చేయాలంటున్న బాధితుడు
– ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీళ్లు!
తెలంగాణలో కబ్జాలకు కొదవేం లేదు. రేట్లు పెరిగిపోయాయని ప్రభుత్వం ఎంత ఆర్భాటంగా చెప్పుకున్నా.. అక్రమార్కుల ఆగడాలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. తాజాగా వరంగల్ టు హయత్ నగర్ లింకులు ఉన్న రిజిస్ట్రేషన్ బాగోతం ఒకటి వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భాను కుమార్, ప్రీతి ఎన్నారైలు. అమెరికాలో ఉంటారు. వీరికి హయత్ నగర్ లో 444 గజాల స్థలం ఉంది. ఓనర్లు ఇండియాలో లేరని గమనించిన అక్రమార్కులు.. వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మసియోద్దీన్ సహకారంతో డమ్మీ పత్రాలు సృష్టించి వారి పేరుపై జీపీఏ చేసుకున్నారు. అయితే.. అదే భూమిని రిటైర్డ్ ఉద్యోగి సుదర్శన్ రెడ్డికి రూ.42 లక్షలకు అమ్మేశారు.
కొద్దిరోజులు గడిచాక.. తాను కొనుగోలు చేసిన భూమి పత్రాలు సరైనవి కావని తెలుసుకున్నాడు సుదర్శన్ రెడ్డి. దీనిపై మధ్యవర్తులను అడగ్గా.. తమకేం తెలియదని చేతులెత్తేశారు. అంతా సబ్ రిజిస్ట్రార్ మసియోద్దీన్, పరిటాల సుబ్బారావు అనే వ్యక్తి చెబితేనే చేశామని చెప్పారు. దీంతో షాక్ తిన్న సుదర్శన్.. పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాడు.
అయితే.. ఈ వ్యవహారంపై ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు సుదర్శన్ రెడ్డి. సబ్ రిజిస్ట్రార్ ను అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని తిడుతున్నాడని చెబుతున్నాడు. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కొనుగోలు చేసిన భూమిలోనే విషం తాగి చస్తానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సుదర్శన్.