ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గత కొంతకాలం ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటాపడుతూ… ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కానీ ఆ యువతి మాత్రం అతని ప్రేమను నిరాకరించింది.
దాంతో కోపం పెంచుకున్న యువకుడు యువతిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాడు. అందుకు యువతిని కారుతో ఢీకొట్టాడు. తొలుత దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అసలు విషయం వెలుగు చూడడంతో హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి యువకుడితో ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…
కల్యాణదుర్గానికి చెందిన భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో మైథిలి అనే యువతిని వేధిస్తున్నాడు. అయితే ఆ యువకుడు యువతికి సోదరుడి వరుస కావడంతో యువతి నిరాకరించింది. దీంతో యువతి పై కోపం పెంచుకున్న భాస్కర్… స్కూటీపై వెళ్తున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు.
కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరగగా… మొదట ప్రమాదంగా భావించారు స్థానికులు… అయితే మైథిలిని ఢీకొట్టిన తర్వాత… వేగంగా కారు వెళ్లడంతో కొద్దిదూరంలోనే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కారు ఢీకొట్టడంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు.