దేశం నుంచి కోవిడ్ ను పూర్తిగా తరిమి కొట్టడానికి చైనా చాలా కఠినంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేసింది. విపరీతంగా పరీక్షలు, ఏ మాత్రం లక్షణాలున్నా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు, లాక్ డౌన్, ప్రతీ చోట నెగిటివ్ సర్టిఫికెట్ అవసరం.. మొదలైన ఆంక్షలను కఠినంగా అమలు చేసింది. దాంతో, కొంతవరకు కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఈ పాలసీతో అంతకుమించిన ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి.
జీరో కోవిడ్ పాలసీని నిరసిస్తూ చైనా ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అసాధారణ రీతిలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అత్యంత శక్తిమంతుడైన అధ్యక్షుడు జిన్ పింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యానర్లు ఏర్పాటు చేశారు. లాక్ డౌన్, క్వారంటైన్ నిబంధనలను సడలించాలని, జీరో కోవిడ్ పాలసీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాంతో, చైనా ప్రభుత్వం దిగి వచ్చింది. జీరో కోవిడ్ పాలసీలోని చాలా ఆంక్షలను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ఆంక్షలను తొలగించిన చైనా ప్రభుత్వం.. తాజాగా, చాలావరకు కోవిడ్ ఆంక్షలను పక్కనబెట్టింది. చివరకు, వైరస్ ను అంతమొందించడానికి బదులుగా, మిగతా ప్రపంచం మాదిరిగా వైరస్ తో సహజీవనానికి చైనా సిద్ధమైంది. మరోవైపు, ఈ ఆంక్షల సడలింపు వల్ల కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరుగుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఇకపై కోవిడ్ లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండవచ్చు. వారిని బలవంతంగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపించరు.కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ను కొన్ని అత్యవసర సందర్బాల్లో మాత్రమే అడుగుతారు. ప్రయాణాల సమయంలో నెగిటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు.