వైఎస్ వివేకానంద హత్య కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఓ పక్క ఈ కేసు విచారణలో సీబీఐ వేగం పెంచితే.. మరో వైపు ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరుతో టీడీపీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. వివేక హత్య కేసులో పాత్రధారులెవ్వరు.. సూత్రధారులెవ్వరు అనే వివరాలతో పుస్తకం రూపకల్పన చేశారు.
‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..’ నినాదంతో ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు.బాబాయ్ గొడ్డలి పోటులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం,నిర్మాత అన్నీ అబ్బాయేనని నేతలు ఆరోపించారు.
తాడేపల్లి ప్యాలెస్ అండ లేకుండా ఇన్ని నేరాలు..ఘోరాలు సాధ్యం కాదని ధ్వజమెత్తారు. వివేకా హత్య జరిగిన వేకువ జాము 3 గంటల సమయంలో నవీన్ ఫోన్ ద్వారా భారతీ రెడ్డితో,ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్ రెడ్డితో మాట్లాడానని అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ వివరాలను పుస్తకంలో పేర్కొన్నారు.
సీబీఐ ఛార్జ్ షీట్, వివేకా కుమార్తె సునీత అఫిడవిట్స్, వైఎస్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగూల్మం తదితర అంశాలను పుస్తకంలో పొందుపర్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రాధారులెవ్వరు.. సూత్రధారులెవ్వరు అనే వివరాలతో పుస్తకం రూపకల్పన చేశారు.