కరోనా బాధితులకు సాయం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు పీఎం కేర్స్ ఫండ్ కు వచ్చిన విరాళాల వివరాలను.. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుతో కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. మొత్తం రూ.10,990 కోట్ల నిధులు అందినట్టు తెలిపింది. ఇందులో నుండి రూ.3,976 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
స్వచ్చంద విరాళాల రూపంలో రూ.7,183 కోట్లు రాగా.. విదేశాల నుంచి రూ.494 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నిధి నుంచి రూ.3,976 కోట్లను సహాయ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు స్పష్టం చేశారు. రూ.1,311 కోట్లను భారత్ లో తయారైన వెంటిలేటర్ల కొనుగోలుకు వెచ్చించినట్టు తెలిపారు.
ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.201.58 కోట్లు.. ముజఫర్ పుర్, పాట్నాలలో 500 పడకల కొవిడ్ ఆస్పత్రుల నిర్మాణానికి రూ.50 కోట్లు.. తొమ్మిది రాష్ట్రాల్లో 16 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్ల కోసం రూ.20.4 కోట్లు.. కొవిడ్ టీకాలపై పనిచేస్తున్న ల్యాబ్ ల అప్ గ్రేడేషన్ కోసం రూ.1.01 లక్షలు ఖర్చు అయినట్లు ఆడిట్ రిపోర్ట్ ద్వారా వివరించారు.
2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్ ను ప్రారంభించగా.. మార్చి 31 నాటికి ఐదు రోజుల్లోనే రూ.3,076 కోట్లు సమకూరడం గమనార్హం. ఆసుపత్రుల ఏర్పాటు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధిని వినియోగించారు. 2021 మార్చి నాటికి పీఎంకేర్స్ ఫండ్ బ్యాలన్స్ రూ.7,014 కోట్లుగా ఉంది.