ఇల్లు కట్టి చూడు… పెళ్ళి చేసి చూడు.. ఇది తెలుగులో పాత సామెత. సినిమా తీసి చూడు… సినిమా విడుదల చేసి చూడు… ఇది సినిమా సామెత. ఔను మరి.. సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడం ఒక ఎత్తయితే, పూర్తయిన సినిమాను థియేటర్లలో విడుదల చెయ్యడం అంతకంటే మహా కష్టంగా మారింది ఇప్పుడు. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలకే కష్టలొచ్చిపడుతుంటే, ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పుకుంటే దయనీయమై పోయింది. విడుదల చేయాలనుకున్నప్పుడు సరైన, సరిపడేన్ని థియేటర్స్ దొరక్కపోవడం మొన్నటి వరకు ఒక సమస్యగా ఉంటే, ఇప్పుడు మరెన్నో కొత్త కొత్త సినిమా కష్టాలు పుట్టుకొచ్చాయి.
ఎన్ని వందల కోట్లు వెచ్చించి సినిమా తీసి విడుదల చేసినా సరే, ఆధునిక సాంకేతికత పుణ్యమా అంటూ మొదటి ఆట పడ్డ కేవలం గంటల వ్యవధిలోనే నెట్టింట్లో వచ్చేస్తున్నాయి, అది కూడా హై క్వాలిటీతో. ఇంకొన్ని సినిమాలు విడుదలకు ముందే కొన్ని మాధ్యమాల్లో వదిలేస్తున్నారు లీకు వీరులు. ఇవన్నీ ఓ రకం సినిమా కష్టాలయితే ఇప్పుడూ మరో కొత్తగా వినిపిస్తున్న కష్టం సినిమా విడుదలయ్యాక, లేదా విడుదల కాబోయే ముందు ఈ కథ నాదే, కాపీ కొట్టి తెరకెక్కించేశారు అంటూ కొందరు అజ్ణాత రచయితలు బయటకొచ్చేస్తున్నారు. గుర్తుందిగా ఇటీవలే తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న పూరీ జగన్ – రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదేనంటూ మాజీ హీరో అండ్ దర్శకనిర్మాత ఆకాశ్ కోర్టుకెక్కాడు. ఇది నిజమా లేక అబద్దమా అనేది కాదు విషయం. అన్ని కోట్లు వెచ్చింది సినిమా మొత్తం తెరకెక్కించాక ఇలాంటి కష్టాలు వస్తే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి అనేదే సమస్య.
ఇప్పుడు తాజాగా ఇదే సినిమా కష్టం తమిళ టాప్ హీరో సూర్య నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్నా ‘కాప్పాన్’ సినిమాకు వచ్చిపడింది. మలయాళ సూపర్‌స్టార్ ప్రధానమంత్రిగా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ భారీ చిత్రం తెలుగులో ‘బందోబస్ట్’ గా విడుదల కాబోతోంది. ఈ సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చెన్నై నగరంలోని క్రోంపేటకు చెందిన జాన్ ఛార్లెస్ అనే ఓ వ్యక్తి ఈ కాప్పాన్ కథ తనదేనని, పదేళ్ళ క్రితమే “సరవెడి” అనే పేరుతో తాను రాసుకున్న కథని దర్శకులు కే.యస్.రవికుమార్, కె.వి.ఆనంద్‌లకు చెప్పానని అతనంటున్నాడు. కథ చాలా బాగుందని, తనకు అవకాశమిస్తానని కే.వి.ఆనంద్ మాటిచ్చాడట కూడా.
ఉన్నట్టుండి ఇప్పుడీ కథతో సినిమా చెయ్యడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, అందుకే ఈ సినిమాపై తాను కోర్టు మెట్లెక్కానని జాన్ ఛార్లెస్ చెప్పాడు. పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తులు ఈ కేసును సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. మరి సూర్య్ “బందోబస్త్” సినిమాకు ఈ సినిమా కష్టాలు తీరతాయో లేదో చూద్దాం.