దేశంలోనే అతి పెద్ద వాణిజ్య సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు సృష్టించడానికి పరుగులు పెడుతోంది. ఇప్పటికే రూ.9.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించగా…తాజాగా రూ.10 లక్షల కోట్ల మైలురాయికి మరింత దగ్గరైంది. ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు రాణించడంతో కొత్త రికార్డుకు కేవలం రూ.20 వేల కోట్ల దూరంలో ఉంది. బుధవారాని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర బీఎస్ ఈలో 2.47 శాతం పెరిగి రూ.1,547.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడే లో షేరు విలువ 4.10 శాతం దాకా పెరిగి రూ.1,571.85 దగ్గర లైఫ్‌టైమ్ రికార్డ్ ను తాకింది. అటు ఎన్ఎస్ఈ లోనూ రిలయన్స్ షేరు ధర 2.56 శాతం లాభంతో రూ.1,548.50 దగ్గర స్థిరపడింది.
ఇంట్రాడేలో కంపెనీ విలువ రూ.9,96,415 కోట్లకు పెరిగి రూ.9,80,699.59 దగ్గర స్థిరపడింది. మరో 19,300 కోట్లు పెరిగితే రిలయన్స్ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లను దాటవేస్తుంది. రాబోయే రోజుల్లో తాము కూడా కాల్స్, డేలా ఛార్జీలు పెంచుతామని రిలయెన్స్ ప్రకటించడంతో స్టాక్ ఎక్సేంజీల్లో రిలయన్స్ షేరు విలువ పెరుగుతోంది.