మరోసారి సంచలనం సృష్టించేందుకు జియో రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో ల్యాప్ టాప్‌ను అందుబాటులోకి జియో తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇన్ బిల్ట్ 4జీ సిమ్ కార్డ్‌తో, రూ.15 వేల ధరలోపు ఉండేలా ల్యాప్ టాప్‌ను అభివృద్ది చేస్తున్నట్టు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దీన్నిజియో బుక్ గా పేరు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో రిలయన్స్ జియో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. జియో బుక్ కోసం క్వాల్‌కామ్ చిప్‌సెట్ ను ప్రముఖ ఆర్మ్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తున్నట్టు వినికిడి.
యాప్ సపోర్ట్‌తో పాటు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై రిలయన్స్ జియో అధికార ప్రతినిధులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక జియోబుక్ నవంబర్ నాటికి మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
మొదటగా వీటిని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆ తర్వాత ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అందిస్తారనే వార్తలు వస్తున్నాయి. మార్చి నాటికి మార్కెట్‌లో భారీగా అమ్మకాలు చేయాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.